బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎడతెరిపి లేని వానలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ముసురు వాతావరణం అలుముకుంది. విజయవాడలో సోమవారం నాడు రోజంతా వాన కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కృష్ణా జిల్లా కృత్తివెన్నులో సోమవారం నాడు 65.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
మరో వైపు ఈ నెల 19న పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వానలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బుధవారం కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన వాతావరణ కేంద్రం, గురు, శుక్రవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వానలు పడతాయని తెలిపింది. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.