(రాష్ట్ర సేవికా సమితి వ్యవస్థాపకురాలు లక్ష్మీబాయి కేల్కర్ 119వ జయంతి నేడు)
అందరూ ‘మౌసీజీ’ అని గౌరవంగా పిలిచే లక్ష్మీబాయి కేల్కర్ 1936 అక్టోబర్ 25న మాతృశక్తిని జాగృతం చేసారు. స్వీయరక్షణ సామర్థ్యంతో, గుండెల్లో ప్రజ్వరిల్లుతున్న దేశభక్తితో, సనాతన ధర్మపు స్ఫూర్తితో, హిందూ సంస్కృతి-జీవనవిధానంతో, ‘రాష్ట్రదేవోభవ’ అనే సూక్తితో ప్రేరణ పొందిన మహనీయురాలు లక్ష్మీబాయి కేల్కర్. ప్రతీరోజూ శాఖ నిర్వహణ ద్వారా మాతృశక్తిని తీర్చిదిద్దింది. భగవా ధ్వజాన్నే గురువుగా భావించి దేశమాత సేవకై రాష్ట్ర సేవికా సమితిని ప్రారంభించింది. చరైవేతి చరైవేతి (ముందుకు సాగిపో) అనే మంత్రంతో రాష్ట్ర సేవికా సమితి తన ఆలోచనలు, బోధనలు, పద్ధతులు, విధానాలతో ఇవాళ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది.
1905 సంవత్సరంలో ఆషాఢ శుద్ధ దశమి తిథి నాడు (జులై 6న) లక్ష్మీబాయి కేల్కర్ నాగపూర్‌లో జన్మించింది. ఆమె పుట్టింటి వారైన దాతే కుటుంబం లోకమాన్య తిలక్ ‘కేసరి’ పత్రికలో రాసే రాతల నుంచి ప్రేరణ పొంది తమ జీవితాన్ని దేశభక్తి విలువలతో నింపుకున్నారు. తల్లి యశోదాబాయి ఆ పత్రిక చదివి మిగతా కుటుంబ సభ్యులకు వివరించి చెబుతుండేవారు. ఆ ప్రభావమే లక్ష్మీబాయి జీవితాంతం తోడుగా నిలిచింది. సమాజ స్పృహ, వ్యవస్థాగత విలువలను లక్ష్మీబాయి తన తల్లిదండ్రుల నుంచే నేర్చుకొంది.
లక్ష్మీబాయి బాల్యం నుంచే దేశభక్తి కలిగి ఉండేది. ఆమె దాదీబాయి హిందూ బాలికల పాఠశాలలో చదువుకుంది. అప్పటికే ఆమె మాటకు మాట జవాబిచ్చే ధైర్యసాహసాలు కలిగి ఉండేది. తర్వాత మిషనరీ స్కూల్లో చదువుకునే రోజుల్లోనూ అదే ప్రవర్తన. అప్పటి పద్ధతుల ప్రకారం 14ఏళ్ళ వయసులో, అంటే 1919లో, వార్ధాకు చెందిన పురుషోత్తమరావు కేల్కర్తో ఆమెకు వివాహమైంది. ఆయన మొదటి భార్య చనిపోవడంతో లక్ష్మీబాయిని రెండో వివాహం చేసుకున్నారు. ఆయన ఇద్దరు కుమార్తెలనూ లక్ష్మీబాయి కన్నకూతుళ్ళలా ప్రేమతో పెంచి పెద్ద చేసారు. పెద్ద కుటుంబాన్ని ఒంటిచేత్తో నౌకర్ల సాయంతో నిర్వహిస్తూ కూతుళ్ళను జాగ్రత్తగా పెంచింది. ఆమెకు ఆరుగురు సంతానం. ఆఖరి కొడుకైన ఆనంద్‌కు నాలుగు నెలల వయసులో పురుషోత్తమరావు తుదిశ్వాస విడిచారు. ఆ తర్వాత లక్ష్మీబాయి ఎన్నో సమస్యలు, సవాళ్ళు ఎదుర్కొంది. కష్టపడి కుటుంబాన్ని పెంచిపోషించింది.
ఒక దశలో లక్ష్మీబాయికి మహాత్మాగాంధీని కలుసుకునే అవకాశం వచ్చింది. ఆమెకు రాజకీయాల కంటె దేశం స్థితిగతుల మీద ఆసక్తి, ఆందోళన ఎక్కువగా ఉండేవి. ‘దేశం ఆరోగ్యం ఆ దేశ ప్రజల ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది’ అన్న గాంధీ ఆలోచనాధోరణి ఆమెను ప్రభావితం చేసింది. తన ఆడబడుచు ఉమాకుంకూ సహకారంతో లక్ష్మీబాయి వీలున్నప్పుడల్లా గాంధీజీ కార్యక్రమాల్లో పాల్గొనేది. విదేశీ టీ, కాఫీ, చక్కెర వినియోగం ఆపివేయడం ద్వారా ఆమె స్వదేశీ ఉద్యమంలో పాలుపంచుకుంది. గాంధీజీ నిర్వహించిన నూలు వడికే కార్యక్రమాల్లోనూ పాల్గొంది.
1925 తర్వాత దేశంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారసాగాయి. నానాటికీ పెరుగుతున్న హిందూముస్లిం ఘర్షణలు ఆమెను ఆందోళనకు గురిచేసాయి. మహిళలు కేవలం శారీరకంగా బలహీనులు అన్న కారణం చేత వారిపై అఘాయిత్యాలకు పాల్పడడం, వారికి అన్యాయం చేయడాన్ని ఆమె భరించలేకపోయింది. దానిగురించి ఎంత ఆలోచించినా ఆమెకు స్పష్టమైన పరిష్కారమార్గం దొరకలేదు. ఒకసారి గాంధీజీ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మీబాయి, ‘మహిళలు ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి’ అని ప్రశ్నించింది. ఆయన, ‘సీతాదేవిని ఆదర్శంగా తీసుకోవాలి’ అని జవాబిచ్చాడు. ప్రతీ ఇంట్లోనూ సీత ఉంటే, రాముడి కోసం ప్రత్యేకంగా ప్రయత్నాలు అక్కర్లేదని గాంధీజీ భావన.
అంతకంటె ముందే, మహిళల జీవితాలు వంటింటికి పరిమితం కారాదనీ, పిల్లలను పెంచి పెద్ద చేయడంలో ఆగిపోకూడదనీ, సామాజిక-రాజకీయ జీవితంలో మహిళలు సైతం భాగస్వాములు కావాలనీ యమునాబాయి హీర్లేకర్ అనే సంస్కర్త పిలుపునిచ్చింది. అలాగే స్వామి వివేకానంద చెరప్పిన ‘సమాజం అనే రథానికి స్త్రీపురుషులు రెండు చక్రాలు’ అన్న సూక్తి ఆమె మదిలో నిలిచిపోయింది.
దేశం అనే గరుడపక్షి ఆకాశంలో ఎత్తుకు ఎగరాలంటే దాని రెండు రెక్కలూ బలంగా, దృఢంగా, సమానమైన సామర్థ్యంతో ఉండాలి. ఆ రెండింటి మధ్యా సమన్వయం ఉండాలి. స్త్రీపురుషుల మధ్య పోటీ కాదు, భాగస్వామ్యం ఉండాలి అని లక్ష్మీబాయి కేల్కర్ అర్ధం చేసుకుంది. దేశం గురించీ, మహిళల గురించీ ఆమె ఆలోచిస్తుండేది. క్రమంగా ఆ ఆలోచనలకు ఒక ఆకృతి రాసాగింది, ఆమెకు తన ఆలోచనలకు దశను, దిశనూ కనుగొంది.
ఆ సమయంలో ఎక్కువమంది పురుషులు మహిళను తమ ఆనందానికి అవసరపడే ఒక వస్తువుగానే భావించేవారు. అదేవిధంగా ప్రవర్తించేవారు. సమాజపు అటువంటి ఆలోచనాధోరణి లక్ష్మీబాయి మనసును తీవ్రంగా కలచివేసింది. ప్రతీదశలోనూ మహిళలు పురుషులపై ఆధారపడి ఉండేవారు, అయినా వారికి భద్రత అన్న భావమే ఉండేది కాదు.
నాగపూర్‌లోని నారింజకాయల విపణిలో స్త్రీలు తీవ్రంగా వేధింపులు ఎదుర్కొనేవారు. ఆ మార్కెట్లో ముస్లిములే ఎక్కువ ఉండేవారు. కుటుంబ పోషణ కోసం పలువురు మహిళలు నారింజకాయలు కమిషన్ పద్ధతిలో అమ్ముతుండేవారు. అటువంటి స్త్రీలను ఎన్నోవిధాలుగా అవమానించేవారు.
లక్ష్మీబాయి ప్రాచీనకాలంలో స్త్రీల ప్రవర్తన గురించి ఆలోచించేది. రావణుడు చెరపట్టి సీతను లంకలో పెట్టినప్పుడు ఆమె తనను తాను రక్షించుకుంది. అప్పుడామెను కాపాడడానికి భర్త రాముడు దగ్గర లేడు. అలాగే భారతంలో ద్రౌపదికి ఐదుగురు వీరులైన భర్తలు ఉన్నా, ఆమె తనను తానే రక్షించుకోవలసి వచ్చింది. సొంత బలం, ఆత్మవిశ్వాసం, నైతికవర్తనలే ఒక మహిళకు సంపద, అవే ఆమె శక్తి. శివాజీని పెంచుతున్నప్పుడు జిజియాబాయి ఎవరి సహాయమూ తీసుకోలేదు. ఆమె దేశభక్తి, హైందవధర్మం పట్ల గర్వం, మాతృభూమిపై విశ్వాసం, శారీరక శక్తినుంచే ఆమె బలవంతురాలు అయింది.
ఆ సమయంలోనే బెంగాల్లో కుసుమబాల ఉదంతం జరిగింది. ఆమె ఒక న్యాయవాది భార్య అయినప్పటికీ, ఒక థగ్గు అఘాయిత్యానికి బలైపోయింది. ఆ సంఘటనతో లక్ష్మీబాయి చలించిపోయింది. ఆమె మనసు కకావికలం అయిపోయింది. ఆ విషయం గురించి ఆమె ఎందరో స్నేహితులతో, భావసారూప్యం కలిగిన వ్యక్తులతో ఎన్నో చర్చలు చేసింది, ఎంతో అధ్యయనం చేసింది. అదే సమయంలో ఆమె సీతాదేవి గురించి రకరకాల రామాయణాలను పరిశీలనగా చదివింది. సీతాదేవిని ఆదర్శంగా తీసుకోవాలన్న గాంధీవాక్కు ఆమెకు ప్రేరణగా నిలిచింది. అదే సమయంలో లక్ష్మీబాయి ఒకసారి ఒక సర్కస్ చూసింది. దాని నిర్వాహకురాలైన ఒక మహిళ బలాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఆ మహిళ ఆ సర్కస్‌ను ఎంతో ఆత్మవిశ్వాసంతో, తన సమర్ధతతో, క్రమశిక్షణతో విజయవంతంగా నడుపుతోంది.
అలాంటి తరుణంలోనే లక్ష్మీబాయి, డాక్టర్ హెడ్గేవార్ గురించి వింది. మొత్తం హిందూ సమాజాన్ని ఐకమత్యంగా నిలిపి ఉంచాలనే ఏకైక మహోన్నత లక్ష్యంతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ను స్థాపించారని తెలుసుకొని, కొంత ఊరట చెందింది. అప్పట్లో దేశంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల కారణంగా సామాన్య మానవులు అయోమయంలో ఉండేవారు. అయితే జాతీయతా భావాలు కలిగిన లక్ష్మీబాయికి వాటిని అర్ధం చేసుకోవడం పెద్ద కష్టం కాలేదు. 1930లో మహాత్మాగాంధీ మహిళల ఆలోచనా ధోరణిలో విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చారు. ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా ఆయన చేపట్టిన దండి యాత్రలో సరోజినీ నాయుడు నేతృత్వంలో ఎందరో మహిళలు పాల్గొన్నారు. వారిలో లక్ష్మీబాయి ఆడబడుచు కూడా ఉన్నారు.
లక్ష్మీబాయి తన కుటుంబానికీ, దేశానికీ వీలైనంత సేవ చేస్తూనే ఉండేది. దేశభక్తి అన్న అగ్ని ఆమె హృదయంలో ఎప్పుడూ ప్రజ్వరిల్లుతూనే ఉండేది. అయితే దైనందిన జీవితంలోని సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు ఆమెను ఎప్పుడూ వదలలేదు. భర్త మరణంతో ఆరుగురు పిల్లల పెద్ద కుటుంబాన్ని నిర్వహించే అతిపెద్ద బాధ్యత ఆమె భుజాలపై ఉంది. ఇళ్ళు, పొలాలు, ఆస్తులు, వాటిచుట్టూ చట్టపరమైన వ్యాజ్యాలు… అన్నింటినీ నిభాయించుకోవడం ఆమెకు కత్తిమీద సాముగానే ఉండేది. అయితే ఆడబడుచు ఉమాబాయి ప్రేమ, ఆదరణలతో లక్ష్మీబాయి ఆ పనులు అన్నింటినీ సమర్థంగానే గడుపుకొచ్చేది. అదేసమయంలో సమాజంలోని మూఢనమ్మకాలు, ప్రమాదకరమైన పెడధోరణులను గమనిస్తూ, వాటికి వ్యతిరేకంగా గళమెత్తుతూ ఉండేది. సమాజంలో సేవ, సౌభ్రాతృత్వ భావనల కోసం కృషి చేస్తూ ఉండేది. 1936 జులైలో బాలికలకు విద్యను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా బాలికల పాఠశాల ప్రారంభించింది.
దాదాపు ఆ సమయంలోనే ఆమె, తన పిల్లలు ప్రతీ సాయంత్రం కర్రలు పట్టుకుని ఎక్కడికో వెడుతుండడాన్ని గమనించింది. తన పనులలో ఎంత సతమతం అవుతున్నా ఆమె బాధ్యత గలిగిన తల్లిగా తన పిల్లలపై ఒక కన్ను వేసే ఉంచేది. కర్రలు పట్టుకుని వెడుతున్న పిల్లలను ఆమె వెంటనే నిలదీసింది. వారు, తాము ఏ గొడవకూ వెళ్ళడం లేదని, ఆమధ్యనే ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ శాఖకు వెడుతున్నామనీ ఆమెకు చెప్పారు. శాఖలు పిల్లల శారీరక, మానసిక, సాంస్కృతిక వికాసానికి సాయపడే కార్యక్రమాలు జరుగుతుంటాయని వివరించారు. ఆవిడ అప్పుడు ఆ శాఖ వివరాలు తెలుసుకోడానికి దాన్ని నిర్వహిస్తున్న అప్పాజీ వద్దకు వెళ్ళింది. డాక్టర్ హెడ్గేవార్ నాగపూర్‌లో ఆర్ఎస్ఎస్ను స్థాపించారు… అక్కడ జాతీయవాద దృక్పథంతో కొత్త తరాన్ని తీర్చిదిద్దుతున్నారు… దేశం, ధర్మం, సంస్కృతి గురించి వివరిస్తున్నారు… అని తెలుసుకొంది. దాంతో తన పిల్లలు సరైన చోటికే వెడుతున్నారని ఆమె సంతృప్తి చెందింది. అలా తన పిల్లల ఆలోచనాధోరణులు శాఖలో నేర్పించే విద్య, విలువల ద్వారా సరైన దిశలో ఉన్నాయని అర్ధం చేసుకుంది.
మగవారికోసం ఆర్ఎస్ఎస్ అటువంటి గణనీయమైన కార్యం చేస్తుంటే, సమాజానికి సజీవశక్తి అయిన మహిళల గురించి కనీసం ఆలోచన అయినా చేయకపోవడమేంటి? ఆ ఆలోచనతో ప్రేరణ పొందిన లక్ష్మీబాయి, డాక్టర్ హెడ్గేవార్ను కలుసుకోవాలనుకుంది. ఒక స్నేహితురాలితో కలిసి ఆమె మహిళా సాధికారత గురించిన తన ఆలోచనలను మొదటిసారి హెడ్గేవార్ ముందు ఉంచింది. వారు ఆ అంశాన్ని అన్ని కోణాల నుంచీ సమగ్రంగా చర్చించారు. పురుషులలాగే, వారికి విలువలను ప్రబోధించే ప్రాథమిక కేంద్రమైన మాతృశక్తిని కూడా వ్యవస్థీకరించాలి అని లక్ష్మీబాయి వాదించింది. స్త్రీలు కూడా శారీరకంగానూ, మానసికంగానూ, మేధోపరంగానూ, సైద్ధాంతికంగానూ సమగ్రంగా అభివృద్ధి చెందాలి. వారిలో దేశభక్తి విలువలు కూడా ప్రోది చేయాలి. తద్వారా దేశాభివృద్ధిలో మాతృశక్తిని కూడా వినియోగించాలి. ఆ ఆలోచనలతో, సంఘ శాఖల్లో మహిళలను కూడా పాల్గొనేలా చేయవచ్చు కదా అని లక్ష్మీబాయి అడిగింది.
అదే అంశంపై డాక్టర్ హెడ్గేవార్, లక్ష్మీబాయి ఐదారు సార్లు సమావేశమై చర్చలు జరిపారు. లక్ష్మీబాయి కేల్కర్ మౌసీ సైద్ధాంతిక దృఢత్వానికి కూడా అదొక పరీక్షగా నిలిచింది. ఆ మేధోమధనం తర్వాత జాతీయ ప్రయోజనాలే లక్ష్యంగా కేవలం మహిళల కోసం మౌసీ ఒక సంస్థను స్థాపించాలని నిర్ణయం జరిగింది. దానికి కొన్ని నియమ నిబంధనలు ఏర్పరచారు. సంస్థ పేరు కూడా ఆర్ఎస్ఎస్ అనే ఆంగ్ల అక్షరాలతోనే ఉండాలని నిర్ణయమైంది. అంటే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, రాష్ట్ర సేవికా సమితి లక్ష్యం ఒకటే అయినా, వారి విధివిధానాలు దాదాపు ఒక్కటే అయినా, రెండు సంస్థలూ సమాంతరంగా, స్వతంత్రంగా ఉంటాయి. ఆ సమయంలోనే డాక్టర్ హెడ్గేవార్ ఒక కీలకమైన సూచన చేసారు. మీ సంస్థ మహిళా సంస్థ అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, సంఘ్‌ను గుడ్డిగా అనుకరించకుండా, దాని పద్ధతులూ కార్యక్రమాలను రూపొందించుకోవాలి అని సూచించారు.
ఆ మేధోమధనం సమయంలో మౌసీ తన తల్లిదండ్రుల సూచనలను సైతం నిరంతరాయంగా తీసుకొంటూ ఉండేది. సేవికా సమితి ఏర్పాటు గురించి తన తండ్రితో చర్చిస్తూ ఉండేది. ఆ ప్రయత్నం బృహత్తరమైనదనీ, ఏమాత్రం తడబడని దృఢసంకల్పంతో తుదిశ్వాస వరకూ పనిచేయాలనీ ఆయన తన కుమార్తెకు మార్గదర్శకత్వం చేసారు. ఒక్కసారి పని మొదలుపెడితే దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని ప్రబోధించారు. ఇంటిపనులను, దేశసేవా కార్యక్రమాన్నీ సమతౌల్యం చేసుకోవాలని సూచించారు. నాటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న దుస్సహ పరిస్థితుల కారణంగా, వారిగురించి వ్యవస్థీకృతంగా పనిచేయవలసిన అవసరం ఎంతయినా ఉంది. ఆ పని చేసేది తానే ఎందుకు కారాదన్న లక్ష్మీబాయి ఆలోచనను తల్లిదండ్రులు సమర్ధించారు. డాక్టర్జీ మార్గదర్శకత్వంలో ఆమె సంకల్పం మరింత దృఢం అయింది. వార్ధాలో మొదలైన ఆలోచనను దేశవ్యాపితం చేయాలని భావించింది. వీణూతాయి కాలంబకర్, కాళిందీతాయి పాటన్కర్, మాయీ నాగలే, యమునాతాయి కానే వంటి స్నేహితులతో చర్చించాక లక్ష్మీబాయి మౌసీ ఒక నిర్ణయం తీసుకుంది. అందరి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకుని ‘తేజస్వి హిందూరాష్ట్ర పునర్నిర్మాణం’ అనే ఘనమైన లక్ష్యంతో ‘రాష్ట్ర సేవికా సమితి’ ప్రారంభమైంది. మొదట్లో స్వీయరక్షణ కోసం శారీరక శిక్షణ ఇవ్వడంతో సేవికా సమితి కార్యకలాపాలు మొదలయ్యాయి. మౌసీ పిల్లలు ఆ కార్యక్రమానికి తమ సేవలందించారు.
సేవికా సమితి అనే ఆలోచన ఒక విత్తనంలా మొదలై, ఒక విశ్వాసంగా పెరిగి, ఒక ప్రయత్నంగా పుట్టుకొచ్చింది. ఒక పసిబిడ్డ పుట్టినట్టే సమితి ఆవిర్భావంలోనూ ఎన్నో భావోద్వేగాలూ, పురిటినెప్పులూ తలెత్తాయి. సమాజ సేవలో సమితి ప్రయాణం, ఆ క్రమంలో సేవికల అంకితభావం, వారి పరస్పర సహకారం గొప్పవి. సమితి కార్యక్రమాల విస్తరణ… విశ్వాసం, అంకితభావం, నిబద్ధత అనే పునాదుల మీద సాగింది. అష్టభుజి అయిన దేవీమాత ప్రేరణతో ప్రతీరోజూ శాఖ నిర్వహించేవారు, చరిత్రకు సాక్షీభూతంగా నిలిచిన భగవాధ్వజాన్ని గురువుగా స్వీకరించారు. ఘనమైన హిందూదేశాన్ని పునరుజ్జీవింపజేయడమే సమితి లక్ష్యం. అటువంటి ఆలోచనలు, విలువలతో లక్ష్మీబాయి మౌసీ మొదట తనను తాను మలచుకున్నారు. మహిళలు, కుటుంబాలు, సమాజమే ఈ దేశానికి శక్తినిచ్చే కేంద్రం అనే భావనను విశ్వసించారు. రోజువారీ శాఖలు, బైఠక్‌లు(సమావేశాలు), అభ్యాస వర్గలతో మహిళలు పూర్తిస్థాయి కార్యకర్తలుగా ఎదిగారు. వారందరికీ స్ఫూర్తి ఒకటే ‘రాష్ట్రదేవోభవ’ (దేశమే దైవం కావాలి). రాష్ట్ర సేవికా సమితి కార్యక్రమాలు ఎన్నో అవరోధాలను అధిగమించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తం అవుతున్నాయి.
డాక్టర్ హెడ్గేవార్ నేతృత్వపు ప్రేరణతో భండారాలో మాన్ నానీ కోల్తే, పుణేలో వన్ తాయి ఆప్టే, సాంగ్లీలో మాయీ లిమాయే వంటి స్థానిక నేతలు కొన్ని సంస్థలను ప్రారంభించారు. స్థానికంగా మహిళా సాధికారతను చాటే కార్యక్రమాలు నిర్వహించేవారు. దేశహితం కోసం నిస్వార్థంగా అంకితభావంతో తమ సంస్థలను లక్ష్మీబాయి ప్రారంభించిన రాష్ట్ర సేవికా సమితిలో విలీనం చేసారు.
లక్ష్మీబాయి కేల్కర్ మౌసీ జీవన గమనం అందరికీ ఆదర్శప్రాయం. అద్భుతమైన వ్యక్తిత్వం, దేశభక్తి, నిబద్ధత, అంకితభావం ఆమె సొంతం. మహిళలు పట్టుదలతో ఎలా ఉండాలి, దేశం కోసం ఎలా కష్టపడాలి అని నిరూపించిన స్త్రీమూర్తి మౌసీ. రాష్ట్ర సేవికా సమితి ఆద్య ప్రముఖ్ సంచాలికగా ఎన్నో సంక్షోభ సమయాల్లో అసమాన ధైర్యం ప్రదర్శించింది. దేశ విభజన సమయంలో కరాచీ వెళ్ళి అక్కడి సేవికలకు మానసిక ధైర్యం కలిగించింది. పనిలో ఎంతో కఠినంగా ఉంటూనే మాతృమూర్తిగా ప్రేమను పంచింది. భరతమాత చరణాల వద్ద ప్రజ్వరిల్లిన జ్వాలగా నిలిచింది. ‘రాష్ట్రదీపోభవ’ (దేశానికి వెలుగు)లా నిరంతరాయంగా వెలుగునిచ్చే ఆరని జ్యోతి లక్ష్మీబాయి కేల్కర్ మౌసీ అందరికీ అనంతమైన స్ఫూర్తి ప్రదాత.