కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలో సమాజ సేవకుడిగా గుర్తింపు ఉన్న ఆసిఫ్ అనే వ్యక్తి ఘాతుకానికి ఒడిగట్టాడు. తన సొంత కూతురి వీడియోలను అసభ్యంగా ఎడిట్ చేసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసాడు. కన్నతండ్రి చేసిన దుర్మార్గంతో ఆ అమ్మాయి ఆత్మహత్యాప్రయత్నం చేసింది.
ఆసిఫ్ కుమార్తె వారి బంధువుల్లో ఒక వ్యక్తిని ప్రేమించింది. ఆసిఫ్ ఆ బంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. కూతురు తను చెప్పిన మాట వినడం లేదన్న కోపంతో ఆసిఫ్ ఊగిపోయాడు. వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలను ఎడిట్ చేసి వాటిని ఆన్లైన్లో పెట్టాడు.
ఆసిఫ్ మొదట తన కుమార్తె ప్రియుణ్ణి ఇంటికి పిలిచి అతనిపై భౌతికదాడికి పాల్పడ్డాడు. తర్వాత వారిద్దరి ఫోన్లూ లాక్కున్నాడు. వాటిలో వారిద్దరూ కలిసి ఉన్న వీడియోలను తన ఫోన్‌కి బదలాయించాడు. ఆ వీడియోలను అసభ్యంగా ఎడిట్ చేసి, వివిధ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసాడు. వాళ్ళ ఫోన్లు రెండూ ధ్వంసం చేసాడు.
ఆసిఫ్ తన భార్య, కుమార్తెలను కోపంతో చితకబాదిన దృశ్యాలు సిసిటివి కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్యాలు వైరల్ అయిపోయాయి. తన చిత్రాలను తన తండ్రే అశ్లీలంగా ఎడిట్ చేసి వైరల్ చేయడంతో ఆసిఫ్ కుమార్తె తీవ్రంగా మనస్తాపం చెంది, ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఇప్పుడామె అజ్జరకాడు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఆసిఫ్‌కు ఉడుపి జిల్లాలో గొప్ప సమాజసేవకుడిగా గుర్తింపు ఉంది. ముల్కి ప్రాంతంలో ‘ఆపద్బాంధవ సైకో రిహాబిలిటేషన్ సెంటర్’ వ్యవస్థాపకుడిగా మంచి పేరుంది. అక్కడ మానసిక సమస్యలున్న వారికి, మాదకద్రవ్యాలకు అలవాటు పడినవారికీ చికిత్స చేస్తారు. అయితే ఇటీవలే, ఆ సంస్థకు విరాళాలుగా వచ్చిన ఆస్తులను అమ్మేసుకుని ఆసిఫ్ సొమ్ము చేసుకున్నాడన్న ఆరోపణలు వచ్చాయి.
అంతేకాదు, పునరావాస కేంద్రం పేరిట ఆసిఫ్ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని స్వయానా అతని భార్య షబ్నమే ఆరోపణలు చేసింది. తన భర్త మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డాడనీ, ఆ మత్తులోనే తనను హింసించేవాడనీ ఆమె చెప్పింది. తన భర్త తప్పుడు పనుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుల ఆధారంగా పాడుబిద్రి పోలీసులు ఆసిఫ్ మీద కేసు నమోదు చేసారు. పరారీలో ఉన్న ఆసిఫ్‌ను వెతుకుతున్నారు.