సహజ వనరుల దోపిడీని ఏ ఒక్కరూ ఆమోదించరని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఐదేళ్ళ వైసీపీ పాలనలో సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు, అధికారం మాటున పంచభూతాలను మింగేశారని దుయ్యబట్టారు.
విశాఖ, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వైసీపీ కార్యాలయాల కోసం భూముల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. అనర్హుల చేతికి అసైన్ మెంట్ భూములు వెళ్లాయన్నారు. ఏకంగా భూముల సరిహద్దులే మార్చేశారన్నారు.
వైసీపీ అక్రమాలకు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పరాకాష్ఠగా నిలిచిందన్నారు. భూములన్నీ దోచుకునేందుకు చట్టంతో రాచబాట వేసుకోవాలని ప్రయత్నించారన్నారు. విశాఖలో రామానాయుడు స్టూడియోకి ఇచ్చిన భూములను అక్రమంగా నివాస స్థలాలకు కేటాయించి అందులో వాటా కొట్టేశారని తెలిపారు. ఓల్డ్ ఏజ్ హోమ్ కోసం హయగ్రీవ సంస్థకు ఇచ్చిన 12.51 ఎకరాల భూమిని, అప్పటి విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రెసిడెన్షియల్ డెవలప్ మెంట్ కింద మార్చి అందులో వాటా తీసుకున్నారని చెప్పారు. కోట్ల విలువ చేసే 15 ఎకరాల భూములను కేవలం లక్ష రూపాయల చొప్పున శారదాపీఠానికి వైసీపీ ప్రభుత్వం కట్టబెట్టిందన్నారు.
ఒంగోలులోనూ భారీగా భూ అక్రమాలు జరిగాయన్నారు. వివాదాలు ఉన్న భూములు, యాజమాన్య హక్కులు లేని ప్రైవేటు భూములు, బీడు భూములు, ప్రభుత్వ స్థలాలను వైసీపీ నేతలు గుర్తించి వాటిని చేజిక్కించుకునేలా అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు.
తిరుపతి లో 22-ఏ ఉపయోగించి ఈ భూములను కొట్టేసే పరిస్థితికి వచ్చారని వివరించారు.ఇళ్ల పట్టాల విషయంలో రూ.3 వేల కోట్ల మేర అక్రమాలు జరిగాయన్న చంద్రబాబు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పేదలకు చెందిన 10 వేల ఎకరాల భూములను వైసీపీ పాలనలో బలవంతంగా లాగేసుకున్నారన్నారు.
వైసీపీ కార్యాలయాల కోసం భారీ ఎత్తున అక్రమాలకు జగన్ ప్రభుత్వం పాల్పడిందన్నారు. 23 జిల్లాల్లో జీవో నెం.340 ఉపయోగించుకుని, రెండు ఎకరాల భూమిని 33 ఏళ్ళ లీజుకు కేటాయించారని చెప్పారు.
గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేసినందున ప్రజలు ఓసారి తమ భూముల వివరాలు చెక్ చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. కబ్జాలకు గురైతే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలన్నారు. గుజరాత్ లో ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని ఏపీలో కూడా అమలు చేస్తామని పేర్కొన్నారు. ఎవరైనా కబ్జా చేయాలంటే భయపడేలా చేస్తామన్నారు.