విడాకులైన ముస్లిం మహిళలకు భరణం చెల్లించాల్సిందేనన్న సుప్రీంకోర్టు తీర్పును అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సవాల్ చేయనుంది. సుప్రీంకోర్టు నిర్ణయం ‘షరియా’కు వ్యతిరేకమంటూ, ఆ తీర్పును వెనక్కి తీసుకునేలా చేయగల దారులను వెతుకుతున్నట్లు ఆ బోర్డు ప్రకటించింది.
‘‘అనుమతించబడిన అన్ని పనులలోనూ అత్యంత జుగుప్సాకరమైన పని అల్లా సమక్షంలో విడాకులు తీసుకోవడమే. కాబట్టి వీలున్నంత వరకూ వివాహాన్ని రక్షించుకోడానికి సాధ్యమైన అన్ని చర్యలూ తీసుకోవాలి, ఆ మేరకు కురాన్‌లో ప్రస్తావించిన ఎన్నో నిబంధనలను పాటించాలి. అయితే వివాహ జీవితం చాలా కష్టంగా మారితే, మానవాళి మంచి కోసమే విడాకులను పరిష్కారంగా చూడాలి. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు, బాధాకరమైన బంధం నుంచి బైటపడిన మహిళలకు మరిన్ని సమస్యలు కలగజేస్తుంది’’ అని ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ప్రకటించింది.
సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోడానికి చట్టపరంగా, రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా సాధ్యం కాగల అన్ని మార్గాలనూ అనుసరించి నిర్ణయం తీసుకోడానికి ఎఐఎంపిఎల్‌బి తమ సంస్థ అధ్యక్షుడు ఖలీద్ సైఫుల్లా రహ్మానీకి అధికారం ఇచ్చింది.
‘‘పెళ్ళి అనేదే ఉనికిలో లేకుండా పోయాక మాజీ భార్యల మనోవర్తికి పురుషుడిని బాధ్యుడిని చేయడం తార్కికంగా సరైనది కాదు’’ అని ముస్లిం పర్సనల్ లా బోర్డ్ వ్యాఖ్యానించింది.
ఆ బోర్డు, ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆమోదించిన యూనిఫాం సివిల్ కోడ్‌ను కూడా సవాల్ చేయాలని నిర్ణయించింది. ప్రార్థనాస్థలాల చట్టాన్ని పునరుద్ధరించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని భావిస్తోంది. అలాగే, ఇజ్రాయెల్‌తో సంబంధాలు తెంచుకోవాలనీ, ఇజ్రాయెల్ చెరబట్టిన వారిని వదిలేయాలని ఆ దేశాన్ని కోరాలనీ భారత ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ముస్లిం పెర్సనల్ లా బోర్డ్ నిర్ణయించింది.