రాజ్యసభలో బీజేపీ బలం మరింత తగ్గింది. ఆ పార్టీ నామినేట్ చేసిన నలుగురు సభ్యులు – రాకేష్ సిన్హా, రామ్ శకల్, సోనాల్ మాన్‌సింగ్, మహేష్ జెఠ్మలానీల పదవీకాలం నేటితో ముగిసింది. ఆ నలుగురూ రాష్ట్రపతి నామినేట్ చేసిన ఎంపీలు. కేంద్రప్రభుత్వం సిఫారసుతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారిని రాజ్యసభకు ఎంపిక చేసారు.
245 మంది సభ్యుల రాజ్యసభలో ప్రస్తుతం 225 మంది సభ్యులున్నారు. కాబట్టి మెజారిటీ మార్కు 113గా ఉండాలి. ఇప్పుడు నలుగురు సభ్యుల రిటైర్మెంట్‌తో రాజ్యసభలో బీజేపీ బలం 86కు తగ్గింది. ఎన్డీయే కూటమి బలం 101కి పడిపోయింది.
కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమికి 87మంది సభ్యులున్నారు. వారిలో కాంగ్రెస్ 26, తృణమూల్ 13, ఆమ్ ఆద్మీ పార్టీ 10, డిఎంకె 10 మంది ఉన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ రెండింటితోనూ పొత్తు లేని బిఆర్ఎస్ వంటి పార్టీల ఎంపీలు, స్వతంత్ర ఎంపీలు మిగిలినవారు.
ఈ పరిస్థితుల్లో బీజేపీకి రాజ్యసభలో ఏవైనా బిల్లులు పాస్ చేయించాలంటే ఎన్డీయేలో లేని పార్టీల మద్దతు స్వీకరించాలి. అంటే అన్నాడిఎంకె, వైఎస్ఆర్‌సిపి వంటి పార్టీలు. ప్రస్తుతానికి బిజెపి మిత్రపక్షాలకు 15 ఓట్లున్నాయి. అంటే మరో 13 ఓట్లు అవసరమవుతాయి.
వైఎస్ఆర్‌సిపి (11), అన్నాడిఎంకె (4) పార్టీలకు బీజేపీతో ప్రత్యక్షంగా సంబంధాలు లేకపోయినా, అవసరమైనప్పుడు వారి మద్దతు తీసుకోవలసి వస్తుంది. వైఎస్ఆర్‌సిపి ఎన్‌డిఎకు గతంలో ‘అంశాలవారీగా’ మద్దతు ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు కూడా అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి అంశాలవారీ మద్దతు ఇస్తూనే ఉంటుంది.
ఇటీవలే ఒడిషాలో అధికారం కోల్పోయిన బీజేడీ, గతంలో బీజేపీకి అటువంటి మద్దతు ఇస్తుండేది. అయితే ఒడిషా శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత, అటువంటి మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఆ పార్టీకి రాజ్యసభలో 9మంది ఎంపీలున్నారు.
భవిష్యత్తులో అన్నాడిఎంకె మద్దతు ఇవ్వడానికి ఇష్టపడకపోతే, బిజెపి నామినేటెడ్ సభ్యులపై ఆధారపడాల్సి ఉంటుంది.
రాజ్యసభలో మొత్తం 12మంది నామినేటెడ్ సభ్యులు ఉన్నారు. వారు సాధారణంగా తటస్థులే అయినా, వారిని అధికార పార్టీ ఎంపిక చేసినందున, సాధారణంగా వారు అధికార పక్షానికే అండగా నిలుస్తారని భావించవచ్చు,
ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం 20 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వారిలో 11మంది, ఎన్నికైన సభ్యులు. ఖాళీగా ఉన్నవి మహారాష్ట్ర, అస్సాం, బిహార్‌లలో చెరో రెండు స్థానాలు. హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, త్రిపురల్లో తలా ఒక సీటు ఖాళీ అయింది.
ఈ 11 స్థానాల్లోనూ 7 సీట్లు గెలుచుకోడానికి బీజేపీకి తగినంత మెజారిటీ ఉంది. మహారాష్ట్రలో పార్టీ ఎంపీలు ఇతరులవైపు మొగ్గుచూపకుండా ఉంటే మరో 2 సీట్లు కూడా దక్కుతాయి. అంటే బీజేపీకి మరో 9 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. అదే జరిగితే, వైఎస్‌ఆర్‌సిపి ఎంపీలను కూడా కలుపుకుంటే ఎన్డీయే కూటమి ఎంపీ సీట్ల సంఖ్య సుమారు 150కి పెరుగుతుంది.
జమ్మూకశ్మీర్‌లో మరో నాలుగు స్థానాలకు సెప్టెంబర్ 30న రాష్ట్ర శాసనసభ ఎన్నికలతో పాటు శాసనమండలి ఎన్నికలు కూడా జరిగే అవకాశముంది.
తెలంగాణలోని ఏకైక ఎంపీ సీటును అధికార కాంగ్రెస్ పార్టీ సాధించుకునే అవకాశముంది.
ఈ సీట్ల సంఖ్యను బట్టి పార్లమెంటులో ప్రతిపక్ష నేత హోదాను సాధించుకునే వీలుంది. అందుకే ఈ రాజ్యసభ స్థానాల్లో ఎంపిక కీలకపాత్ర పోషించనుంది. ఇక్కడ కూడా గెలిస్తే, కాంగ్రెస్ పార్టీ ఉభయసభల్లోనూ ప్రతిపక్ష నేత పదవి దక్కించుకోగలదు.