ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో తిహార్ జైల్లో ఉన్న సీఎం కేజ్రీవాల్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, ఆయన 8.5 కిలోల బరువు కోల్పోయారంటూ ఆ పార్టీ నేతలు చేస్తోన్న ఆరోపణలను జైలు అధికారులు ఖండించారు. కేజ్రీవాల్ జైలుకు వచ్చే నాటికి 65 కేజీల బరువున్నారని, మధ్యంతర బెయిల్‌పై ప్రచారానికి వెళ్లి, మరలా జైలుకు వచ్చినప్పుడు 63.5 కిలోలున్నారని గుర్తు చేశారు. తాజాగా కేజ్రీవాల్ బరువు 61.5 కిలోలున్నట్లు తెలిపారు. తక్కువ ఆహారం తీసుకోవడం వల్లే ఆయన బరువు స్వల్పంగా తగ్గినట్లు డాక్టర్లు తెలిపారు. మెడికల్ బోర్డు పర్యవేక్షణలోనే ఆయనకు ఆహారం, మందులు అందిస్తున్నట్లు జైలు అధికారులు చెప్పారు.
కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ లెవల్స్ నిద్రలో 50కంటే తక్కువకు పడిపోయాయని, ఆయనకు గుండెపోటు వస్తే దానికి బీజేపీ నేతలే బాధ్యత వహించాలంటూ ఆప్ నేతలు చేస్తోన్న ప్రచారాన్ని జైలు అధికారులు ఖండించారు. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు ప్రకటించారు. బెయిల్ పొందేందుకే కేజ్రీవాల్ ఆరోగ్యంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.