చదువుతో పాటు సంస్కారం పెరగాలి. సమాజంలోని తోటి వ్యక్తులను గౌరవించగల లక్షణాలు అబ్బాలి. ఏళ్ళు గడిచే కొద్దీ అలాంటిదేమీ జరగకపోగా, మనలోని వెకిలితనం మరింత బైటపడుతోంది. అపరిమిత స్వేచ్ఛ, ఉచితంగా సామాజిక మాధ్యమాలూ అందుబాటులోకి రావడంతో మనసుల్లోని వెకిలితనం, వికృత మనస్తత్వాలు, వికార బుద్ధులను గొప్పగా ప్రదర్శించుకోవడం సర్వసాధారణమైపోయింది. మంచిని పంచాల్సిన నైతిక బాధ్యత కనుమరుగైపోయింది.
అభ్యుదయం, ఆధునికత పేరిట సంప్రదాయాలను పక్కకు నెట్టేసే క్రమంలో సమాజంలో నైతిక విలువలు క్రమంగా పతనమైపోయాయి. ఇప్పుడు ఎవరైనా ఏదైనా మంచి చెప్పబోతే వారిని అపహాస్యం చేయడం మామూలైపోయింది. పలురకాల మాధ్యమాల కారణంగా సమాజంలో నైతికత, మానసిక వికాసం దెబ్బతినేసాక, స్వస్వరూప పరిజ్ఞానం తెలుసుకోలేనంత అజ్ఞానంలోకి మానవుడు పతనమైపోయాక, అపరిమిత స్వేచ్ఛతో పేట్రేగిపోతున్నవారు, వ్యక్తిగత ప్రవర్తనలో సరిదిద్దుకోవలసిన వికారాలను సామాజిక మాధ్యమాల్లో సాధారణీకరిస్తున్నారు. అప్పుడప్పుడూ అటువంటి వ్యవహారాలపై రచ్చ జరిగితే తప్ప ఎటువంటి చర్యలూ ఉండడం లేదు.
తిరుమలలో కొద్దిరోజుల క్రితం కొందరు తమిళ యూట్యూబర్లు ప్రాంక్ వీడియోలు చేయడం వివాదాస్పదమైంది. నారాయణగిరి షెడ్స్‌లోని క్యూలో వెడుతూ, మరో కంపార్ట్మెంట్ తాళాలు తీసే ఉద్యోగిలా ఒక వ్యక్తి నటించాడు. భక్తులు అతన్ని దేవస్థానం ఉద్యోగి, తాళాలు తీస్తున్నాడని భావించి దైవదర్శనం చేసుకోవాలన్న ఆత్రుతలో లేచి లేచారు. ఆ వ్యక్తి వారందరినీ పరిహాసం చేస్తూ అక్కడినుంచి పరుగుతీసాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
నిజానికి, నారాయణగిరి షెడ్స్ దాటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ప్రవేశించక ముందే భక్తులు తమ మొబైల్ ఫోన్లు డిపాజిట్ చేయాలి. ఆ నియమాన్ని ఉల్లంఘించి క్యూలోకి ఫోన్ తీసుకువెళ్ళడం, ప్రాంక్ వీడియోలు తీయడం, అక్కడి భక్తిపూర్వక వాతావరణాన్ని దెబ్బతీసింది. నిత్యం భక్తుల గోవింద నామాలతో మారుమ్రోగే కంపార్ట్మెంట్లలో ఒకరిద్దరు ఆకతాయిల వికృత చేష్టలు భక్తులకు తీవ్ర అసౌకర్యం కలగజేయడంతో పాటు వారి మనోభావాలు దెబ్బతిన్నాయి. విషయం వెలుగుచూడడంతో అటువంటి ప్రాంక్స్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టిటిడి హెచ్చరించింది.
అంతకంటె భయంకరమైన సంఘటన ప్రవీణ్ హన్మంతు అనే యూట్యూబర్ నిర్వాకం. డార్క్ కామెడీ పేరిట ఎవరిపైన అయినా నోటికొచ్చినట్లు మాట్లాడి, ఎవరైనాన అవమానించవచ్చుననే పైత్యం పూర్తిగా తలకెక్కిన వ్యక్తి ప్రవీణ్. ఒక ఐఎఎస్ అధికారి కుమారుడు, ఉన్నత విద్యావంతుడు అయిన ప్రవీణ్‌లో కనీస సంస్కారం లేదు. ఒక తండ్రి తన చిన్నారి కుమార్తెతో ఆడుకుంటున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లోనుంచి గ్రహించి, తన మిత్రులతో కలిసి డార్క్ కామెడీ పేరిట ఆ తండ్రీకూతుళ్ళ మధ్య అసహజమూ, అసభ్యమూ అయిన లైంగిక సంబంధాన్ని అంటగట్టి పచ్చిబూతులు మాట్లాడారు. తెలుగు సినీనటులు దానిపై ఆగ్రహం వ్యక్తం చేసి, తెలంగాణ ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయడంతో కేసు నమోదైంది.
పోలీసు కేసు నమోదవడంతో ప్రవీణ్ హన్మంతు దిగివచ్చాడు. ఈ వ్యవహారంలో తన తల్లిదండ్రులను సైతం తిడుతుంటే, వారిని నిందించవద్దంటూ జనాలను బతిమాలుకున్నాడు. తన తల్లిదండ్రులను అందరూ గౌరవించాలి, తాను మాత్రం సమాజంలోని మిగిలిన తల్లిదండ్రులను అవమానిస్తూ ఉంటాడు. వారి మనోభావాలు దెబ్బతిన్నా పర్వాలేదు. తను హాస్యంగా భావించే జుగుప్సాకరమైన కంటెంట్‌ను ప్రజల మీద రుద్దిన వెకిలితనం ఇప్పుడు తన సొంత తల్లిదండ్రుల విషయానికి వచ్చేసరికి జ్ఞానోదయం అయింది.
నిజానికి హాస్యం పేరిట అపహాస్యాన్ని సాధారణీకరించడం సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలతో పాపులర్ అయింది. విద్యాబోధన నుంచి ధార్మిక విషయాలను దూరం చేయడంతో నైతిక ప్రవర్తన తెలీని తరాలు తయారవుతున్నాయి. సామాజిక మాధ్యమాలు అందరి చేతిలోకీ అందుబాటులోకి వచ్చేసాక అపరిమిత స్వేచ్ఛ పెరిగిపోయింది. సోషల్ మీడియాకు నియంత్రణలు, నియమ నిబంధనలూ లేకపోవడంతో అసభ్యత, అశ్లీలం అన్ని హద్దులనూ దాటేసేంతగా సాధారణీకరణ చెందాయి. ఈ పరిస్థితిని నియంత్రించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రజల్లోనూ నైతిక ప్రవర్తన పెరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దానికోసం విద్యావ్యవస్థ నుంచి సామాజిక నియమ నిబంధనల వరకూ సమూల ప్రక్షాళన జరగాలి.