అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు కొలువైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి సంబంధించి, దేవస్థానం పాలకమండలి కీలక విషయం వెల్లడించింది. అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి గదుల బుకింగ్‌కు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది.
అక్టోబర్‌కు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు జులై 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జులై 18న ఉదయం 10 నుంచి జులై 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లక్కీ డిప్లో టికెట్లు పొందిన భక్తులు జులై 22న మధ్యాహ్నం 12 గంటలలోపు నగదు చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాలని స్పష్టం చేసింది.
కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ల కోటాను జులై 22న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.
అంగప్రదక్షిణం టికెట్లను ఈ నెల 23న ఉదయం 10 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్ల బుకింగ్‌ను జులై 23న ఉదయం 11 గంటలకు అందుబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది. వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు స్వామిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను జులై 23 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శన టికెట్లు ఈ నెల 24న ఉదయం 10 గంటలకు తిరుమల, తిరుపతిలో అక్టోబర్ కు సంబంధించి గదులను జులై 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. https://ttdevasthanams.ap.gov.in ద్వారా సేవలు, గదులు బుక్ చేసుకోవచ్చు అని టీటీడీ తెలిపింది.