క్రికెట్ లో భారత్ మరో ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది. మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ నేతృత్వంలోని భారత చాంపియన్స్ జట్టు ఫైనల్లో పాకిస్తాన్ ఓడించి ట్రోఫీని అందుకుంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లీగ్- 2024 ఫైనల్లో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై నెగ్గింది.
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 156 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్ ఒక్కడే 36 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ లో మూడు సిక్సులు బాదాడు. భారత బౌలర్లలో అనురీత్ సింగ్ మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. పవన్ నేగి,వినయ్ కుమార్,ఇర్ఫాన్ పఠాన్ తలా ఒక వికెట్ తీశారు.
భారత జట్టు లక్ష్యాన్ని మరో 5 బంతులు ఉండగానే సాధించింది. ఐదు వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసి విజయలక్ష్యాన్ని అందుకుంది. అంబటి రాయుడు 30 బంతుల్లో అర్ధ సెంచరీ చేయగా గురుకీరత్‌సింగ్ మన్(34), యూసుఫ్ పఠాన్(30)పరుగులు చేశారు.