విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. తిరుపతి జిల్లా నాయుడుపేట అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 100 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల కిందటి పాచిపోయిన ఆహారం పెట్టడంతో వాంతులు, విరోచనాలతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వారిని వెంటనే నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
విద్యార్థులకు వైద్య సేవలు అందిస్తున్నారు. వారిలో 50 మంది కోలుకున్నారు. మరో 50 మంది తీవ్రమైన వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారు. నాయుడుపేట అంబేద్కర్ గురుకుల పాఠశాల ఘటనపై అధికారులు స్పందించారు. నాయుడుపేట ఎమ్మార్వో కల్యాణి, కమిషనర్ జనార్థన్‌రెడ్డి విద్యార్థులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.