ఇజ్రాయెల్ హమాస్ శాంతి చర్చలకు బ్రేక్ పడింది. కాల్పుల విరమణ చర్చల నుంచి వైదొలగుతున్నట్లు హమాస్ రాజకీయ విభాగం అధిపతి ఇస్మాయిలీ హనియా ప్రకటించారు. గాజాలోని ఖాన్ యూనిస్‌పై ఇజ్రాయెల్ శనివారంనాడు భీకర దాడుల చేయడంతో 90 మంది సాధారణ పౌరులు మరణించారు. హమాస్ మిలటరీ చీఫ్ మహమ్మద్ డెయిఫ్ లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. దీంతో కాల్పుల విరమణ చర్చల నుంచి వైదొలగుతున్నట్లు హమాస్ ప్రకటించింది. హమాస్ మిలటరీ చీఫ్ మహమ్మద్ డెయిఫ్ సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు.
అమెరికా ఆధ్వర్యంలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య మూడు దశల చర్చలకు తెరలేచింది. గాజాపై పూర్తిగా యుద్ధం ఆపితేనే చర్చలుంటాయని హమాస్ మొదట ప్రకటించినా, తరవాత కొంత దిగివచ్చింది. దీంతో కాల్పుల విరమణకు మార్గం సుగమం అవుతుందని అందరూ భావించారు. ఇంతలోనే ఇజ్రాయెల్ సైన్యం రఫాలో భీకర దాడులకు దిగడంతో హమాస్ శాంతి చర్చల నుంచి వైదొలగింది.