కోట్లాది మంది ఎంతో ఆసక్తిగా గమనిస్తోన్న పూరీ జగన్నాథుడి ఆలయ భాండాగారాన్ని ఇవాళ మధ్యాహం గం.1.28 నిమిషాలకు అధికారులు తెరిచారు. 1978 తరవాత భాండాగారం తెరవడం ఇదే మొదటిసారి. 46 సంవత్సరాల తరవాత భాండాగారం తెరిచారు. స్వామివారి సేవలకు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 1978లో భాండాగారం లెక్కించడానికి 70 రోజుల సమయం పట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు భాండాగారంలోని ఆభరణాలు, రత్నాలను డిజిటలైజేషన్ చేయనున్నారు.
పదకొండు మంది సభ్యుల బృందం ఎట్టకేలకు పూరి జగన్నాథుడి ఆలయ భాండాగారం తెరిచారు. అందులోని ఐదు చెక్క పెట్టెల్లోని ఆభరణాలను లెక్కినే పని ప్రారంభించారు. ఈ కార్యక్రమం దాదాపు రెండు నెలలపాటు సాగనుంది. ఈ నెల 19 వరకు రథయాత్ర ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. 2019లో ఒకసారి భాండాగారం తెరవాలని ప్రయత్నించినా, తాళం చెవి దొరకకపోవడంతో వాయిదా వేశారు. మూడో గది తాళం చెవి కలెక్టర్ కార్యాలయంలోని ట్రెజరీలో ఉందని తేలడంతో అధికారులు ఇవాళ భాండాగారం తలుపులు తెరిచారు. ఆభరణాల వివరాలు అందాల్సి ఉంది.