ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేడు, రేపు వానలు పడతాయని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణకోస్తా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సోమవారం నాడు ఉత్తర, దక్షిణ కోస్తాల్లో వానలు పడతాయని కూడా అంచనా వేశారు.
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికారులను రాష్ట్ర విపత్తులు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ అప్రమత్తం చేశారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు సహాయం కోసం 1070, 112, 18004250101ను సంప్రదించవచ్చు అని తెలిపారు.
కోస్తాంధ్రలో వేగంగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు, రాయలసీమలో సాధారణంగా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాయలసీమతో పాటు కోస్తా ప్రాంతాల్లో పలు చోట్ల వానలు పడ్డాయి. కోస్తాప్రాంతంలో ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, రాయలసీమలో నాలుగు సెంటీమీటర్లుగా రికార్డుఅయింది.
గోదావరి పరీవాహక ప్రాంతంలో కొన్ని రోజులుగా కురుస్తున్న వానలకు గాను పోలవరం, దవళేశ్వరం ప్రాజెక్టుకు వరద పెరిగింది. 88 వేల క్యూసెకుల నీటిని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ నుంచి సముద్రంలోకి వదిలారు. పోలవరంలో వరద 27 మీటర్లకు పెరగగా నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టుకు సంబంధించిన 48 గేట్లు ఎత్తి నీటిని వదిలారు.