జింబాబ్వే సిరీస్ -2024ను భారత్ సొంతం చేసుకుంది. ఓటమితో సిరీస్ ను ప్రారంభించిన భారత్, వరుసగా మూడు మ్యాచుల్లో విజయం సాధించింది. నాలుగో మ్యాచ్ లో ఆతిథ్య జట్టును పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది. ఆఖరి మ్యాచ్ నేటి సాయంత్రం ఐదుగంటలకు జరగనుంది.
శుభమన్ గిల్ నాయకత్వంలో మన కుర్రాళ్ళు నాలుగో టీ20లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగారు. హరారే వేదికగా టాస్ గెలిచిన శుభమన్, తొలుత బౌలింగ్ ఎంచుకున్నారు. భారత బౌలర్లు రాణించడంతో జింబాబ్వే నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది.
జింబాబ్వే ఓపెనర్లలో వెస్లీ మెదెవెరె(25), మరుమానీ(32) ఫర్వాలేదు అనిపించారు. కెప్టెన్ సికందర్ రజా 46 పరుగులతో రాణించాడు. నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే ఏడు వికెట్ల నష్టపోయి 152 పరుగులు చేసింది.
భారత బౌలర్లలో పేసర్లు ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా, అరంగేట్ర ఆటగాడు తుషార్ దేశ్పాండే, శివం దూబే చెరొక వికెట్ పడగొట్టారు. స్పిన్నర్లు రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తమవంతుగా తలా ఒక వికెట్ను తీశారు.
జింబాబ్వే విధించిన 153 పరుగుల లక్ష్యాన్ని భారత్ సునాయాశంగా ఛేదించింది. యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. జైస్వాల్ 93 పరుగులు చేయగా అందులో 13 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. శుభమన్ గిల్ 58 పరుగులు చేశాడు. 15.2 ఓవర్లలోనే విజయ లక్ష్యాన్ని భారత్ అందుకుంది.