కేంద్ర హోంశాఖ తాజాగా జమ్మూకశ్మీర్ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించింది. ఆ సవరణల మేరకు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు అదనపు అధికారాలు దాఖలవుతాయి.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ సవరణలకు ఆమోదముద్ర వేసారు. జమ్మూ, కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతపు వ్యవహారాల నియమ నిబంధనలను సవరించేందుకు వీలు కల్పిస్తూ కొన్ని నియమాలు చేసారు. త్వరలో జమ్మూకశ్మీర్ శాసనసభకు ఎన్నికలు నిర్వహిస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ సవరణలను జులై 12 నుంచి అమల్లోకి తెస్తూ గెజెట్ నోటిఫికేషన్ జారీ అయింది.
కొత్త నిబంధనల ప్రకారం, అడ్వొకేట్ జనరల్‌ను, ఇతర లా ఆఫీసర్లను నియమించడానికి లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తప్పనిసరి. ఎవరినైనా ప్రోసిక్యూట్ చేయడానికి ఆమోదం లేదా తిరస్కారం లేదా అప్పీల్ చేసుకోడానికి కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం ఉండాలి. జైళ్ళ శాఖకు సంబంధించిన కొన్ని వ్యవహారాల్లో సైతం లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అఖిల భారత సర్వీసు అధికారుల నియామకాలు, పోస్లింగ్‌లు తదితర వ్యవహారాల్లోనూ ముందుగా లెఫ్టినెంట్ గవర్నర్‌కు ప్రతిపాదనలు సమర్పించి, ఆయన ఆమోదం తీసుకోవాలి.