తెలంగాణలో భారత రాష్ట్ర సమితిని ఖాళీ అవుతోంది. తాజాగా శుక్రవారం నాడు ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అధికార కాంగ్రెస్‌లో చేరారు. దాంతో, కారు దిగి చేయి అందుకున్న ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది.
2023 డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 సీట్లు గెలిచి సాధారణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతకుముందు రెండు దఫాలు ఘనవిజయాలు సాధించిన బి(టి)ఆర్ఎస్, ఈసారి 39 స్థానాలకు పరిమితమైంది. అందులో ఒక స్థానాన్ని ఉపయెన్నికలో పోగొట్టుకుంది. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ మరింత ఘోరమైన ఓటమిని మూటకట్టుకుంది. మొత్తం 17 ఎంపీ సీట్లలో ఒక్క స్థానమైనా గెలుచుకోలేకపోయింది. దాంతో ఆ పార్టీని వీడిపోతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
అదేక్రమంలో తాజాగా ఇవాళ అరికెపూడి గాంధీ బీఆర్ఎస్‌ను వదిలి కాంగ్రెస్‌లో చేరారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన అరికెపూడి గాంధీతో పాటు ఆయన అనుచరులు, నలుగురు కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో జరిగిన ఒక కార్యక్రమంలో వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
ఇప్పటికి 9మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో బిఆర్ఎస్ బలం 29కి పడిపోయింది. మరికొద్ది రోజుల్లో మరో ఏడుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి చేరతారని తెలుస్తోంది.
బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కు మారిన ఎమ్మెల్యేలు వీరే….
ప్రకాష్ గౌడ్ (రాజేంద్రనగర్), బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి (గద్వాల), పోచారం శ్రీనివాసరెడ్డి (బాన్స్‌వాడ), కాలె యాదయ్య (చేవెళ్ళ), దానం నాగేందర్ (ఖైరతాబాద్), తెల్లం వెంకట్రావు (భద్రాచలం), కడియం శ్రీహరి (స్టేషన్ ఘనపూర్), సంజయ్‌కుమార్ (జగిత్యాల), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి)