రియల్ ఎస్టేట్ వ్యాపారి కమ్మరి కృష్ణ హత్య కేసులో మిస్టరీ వీడింది. హైదరాబాద్ గండిపేట మండలం హౌదర్షాకోట్‌కు చెందిన కమ్మరి కృష్ణను రెండు రోజుల కిందట కొందరు దుండగులు షాద్‌నగర్ కమ్మదనంలోని అతని ఫాం హౌస్ వద్దే గొంతుకోసి చంపేశారు. దీనిపై కేసు నమోదు చేసి విచారించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..
కమ్మరి కృష్ణకు ముగ్గురు భార్యలు. మొదటి భార్యకు ఇద్దరు కుమారులు. మూడో భార్య సంతానానికి మొత్తం ఆస్తి ఇస్తున్నాడనే కోపంతో మొదటి భార్య కుమారుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కమ్మరి కృష్ణ మొదటి భార్య కుమారుడు ఆయన వద్దే పనిచేస్తోన్న బాబాకు రూ.25 లక్షల సుఫారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసులు తెలిపారు. రూ.3 లక్షల నగదు, 2 కార్లు, 3 కత్తులు, రెండు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్యలో మొత్తం ముగ్గురు పాల్గొన్నట్లు వెల్లడైంది.