కీర్తిచక్ర పురస్కారం పొందిన అమరవీరుడు కెప్టెన్ అన్షుమన్ సింగ్ భార్య స్మృతీసింగ్ మీద సామాజిక మాధ్యమాల్లో అశ్లీల వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసారు. భారతీయ న్యాయ సంహిత, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లలోని సెక్షన్ల ప్రకారం ఇంటలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటెజిక్ ఆపరేషన్ సెల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
స్మృతీసింగ్ గురించి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో అసభ్యంగా పోస్ట్ చేసిన విషయాన్ని గుర్తించిన జాతీయ మహిళా కమిషన్, ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దానిపై పోలీసులు స్పందించారు. ఇవాళ కేసు రిజిస్టర్ చేసారు.
సోమవారం పోలీసులకు రాసిన లేఖలో మహిళా కమిషన్ ఆ వ్యాఖ్యలు ఏయే సెక్షన్ల ప్రకారం నేరంగా పరిగణించవచ్చో కూడా పేర్కొంది. భారతీయ న్యాయ సంహిత, 2023లోని సెక్షన్ 79 (మహిళ గౌరవానికి భంగం కలిగించడం), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 67 (ఎలక్ట్రానిక్ రూపంలో అసభ్య సమాచారాన్ని ప్రచురించి ప్రసారం చేయడం) ప్రకారం ఆ వ్యాఖ్య చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఆ వ్యవహారంలో నిష్పాక్షికంగా, త్వరగా చర్యలు తీసుకోవాలనీ, తమకు మూడురోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలనీ మహిళా కమిషన్ పోలీసులను ఆదేశించింది.