కర్ణాటకలో అలవిమాలిన సంక్షేమ హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది, రాష్ట్ర అభివృద్ధికి సొమ్ములు లేవు. ఆ విషయాన్ని స్వయానా ముఖ్యమంత్రి ఆర్థిక సలహాదారే వెల్లడించారు. అవే తరహా వాగ్దానాలతో తెలంగాణలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన సంగతి గమనార్హం.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆర్థిక సలహాదారు బసవరాజ రాయరెడ్డి శుక్రవారం కొప్పాళ జిల్లా యెలబురగ తాలూకా మంగళూరు గ్రామంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంలో మాట్లాడుతూ ‘‘చాలామంది ఎమ్మెల్యేలు తమతమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం నిధులు కావాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. గ్యారంటీ పథకాల కోసం సుమారు 65వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. నేను ఆర్థిక సలహాదారుని కాబట్టి, చెరువు అభివృద్ధి పనులకు ఎలాగోలా గ్రాంట్ సాధించడానికి తంటాలు పడుతున్నాను’’ అని చెప్పారు. యెలబురగ ఎమ్మెల్యే అయిన బసవరాజ రాయరెడ్డి ‘‘ప్రజలకు అభివృద్ధి కావాలి. కానీ నన్ను నమ్మండి, అస్సలు నిధులు లేవు’’ అని వ్యాఖ్యానించారు.
బీజేపీ ఎమ్మెల్యే రమేష్ జార్కిహోళి మూడు రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రప్రభుత్వం ఖజానాలో నిధులు లేవని చెబుతూ కేవలం బెంగళూరులోని అభివృద్ధి పథకాలకే డబ్బులిస్తోందని వివరించారు. కాంగ్రెస్ సర్కారు బెంగళూరు మినహా మిగతా రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తోందని, అది దారుణమైన అన్యాయమనీ మండిపడ్డారు. గత బీజేపీ ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి పథకాలను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహించారు.
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు గ్యారంటీ పథకాల పేరిట పెద్దమొత్తంలో నిధులు ఖర్చు చేస్తోంది. అవి గృహజ్యోతి, గృహలక్ష్మి, అన్నభాగ్య, శక్తియోజన, యువనిధి. అయితే ఆ గ్యారంటీల వాగ్దానాలు ఎన్నికల్లో పెద్దగా ఫలితాన్నివ్వలేదని కాంగ్రెస్ నేతలే అంతర్గతంగా విమర్శిస్తున్నారు. అందువల్ల ఆ పథకాలను పునస్సమీక్షించాలని తమ పార్టీ నాయకత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
జనాకర్షక పథకాలను ప్రకటించడం సులువే. కానీ వాటిని అమలు చేయడం చాలా కష్టం. కర్ణాటకలో ఐదు గ్యారంటీల పథకంతోనే అధికారంలోకి వచ్చామని భావించిన కాంగ్రెస్, తెలంగాణలోనూ అదే పద్ధతి కొనసాగించింది. అక్కడ రేవంత్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ అధికారంలోకి రాగలిగినా, కర్ణాటకలోలాగే పథకాల అమలుకు అవస్థలు పడుతోంది.
రేవంత్‌రెడ్డి రాజకీయ గురువు, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు సైతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అలాంటి హామీలే ఇచ్చి ఇప్పుడు అవస్థలు పడుతున్నారు. జగన్ ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని విమర్శించిన బాబు, ఎన్నికల ప్రచారం సమయంలో చదువుకునే ప్రతీపిల్లవాడి పేరిటా ఒక్కొక్కరికీ రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ పథకానికి ‘తల్లికి వందనం’గా పేరు మార్చి, చదువుకునే పిల్లలున్న ప్రతీ తల్లికీ రూ.15వేలు ఇస్తామని మాట మార్చారు. దానిపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఇంక ‘సూపర్ సిక్స్’లోని మిగతా హామీలను ఎలా అమలు చేస్తారో చూడాలి.