పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ నియోజకవర్గ ఎంపీ అమృత్‌పాల్ సింగ్ సోదరుడు హర్‌ప్రీత్‌సింగ్‌ను జలంధర్ పోలీసులు అరెస్ట్ చేసారు. హర్‌ప్రీత్ సింగ్, జలంధర్ సమీపంలోని ఫిల్లౌర్‌లో డ్రగ్స్‌తో పట్టుబడ్డాడు. అతనితో పాటు మరోవ్యక్తిని కూడా అరెస్ట్ చేసారు.
జలంధర్ రూరల్ ఎస్ఎస్పి అంకుర్ గుప్తా ధ్రువీకరించిన వివరాల మేరకు… ఫిల్లౌర్ చెక్‌పాయింట్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా అక్కడ హర్‌ప్రీత్ సింగ్ దొరికాడు. అతని దగ్గర 4 గ్రాముల ‘ఐస్’ అని పిలిచే ‘మెథాంఫిటమైన్’ అనే మాదకద్రవ్యం లభించింది. ఆ సమయంలో హర్‌ప్రీత్ మాదకద్రవ్యం సేవించిన మత్తులో ఉన్నాడు. అతనితో పాటు లవ్‌ప్రీత్‌సింగ్ అనే మరో వ్యక్తి కూడా ఉన్నాడు. వారిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసారు. ఆ వెంటనే వైద్యపరీక్షలు నిర్వహించారు.
ఎంపీ అమృత్‌పాల్ సింగ్ రెండేళ్ళుగా పంజాబ్ రాజకీయాల్లో క్రియాశీలంగా పనిచేస్తున్నాడు. గతంలో విదేశాల్లో ఉన్న అమృత్‌పాల్, భారతదేశానికి తిరిగివచ్చి, పంజాబ్ వేర్పాటువాద ఉద్యమానికి మద్దతుగా ‘వారిస్ పంజాబ్ దే’ అనే సంస్థను ప్రారంభించాడు. అమృత్‌పాల్ పంజాబ్‌లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ స్వగ్రామం జల్లూపూర్ ఖేరాలో ఒక డీ-అడిక్షన్ సెంటర్ కూడా ప్రారంభించాడు. ఆ తర్వాత ఖలిస్తాన్ ఉద్యమానికి అనుకూలంగా పనిచేయడం మొదలుపెట్టాడు.
గతేడాది ఒక వ్యక్తిని పోలీస్ కస్టడీలోనుంచి విడిపించే క్రమంలో వారితో ఘర్షణకు పాల్పడ్డాడు. దానితోపాటు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై అమృత్‌పాల్‌ను అరెస్ట్ చేసారు. జాతీయ భద్రతా చట్టం కింద అతన్ని అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ఉంచారు.
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అమృత్‌పాల్ సింగ్ జైల్లోనుంచే పోటీ చేసాడు. ఖదూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా విజయం సాధించాడు. కాంగ్రెస్ అభ్యర్ధిపై సుమారు 2లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచాడు. దాంతో పటిష్ట భద్రత నడుమ అతన్ని పార్లమెంటుకు తీసుకువెళ్ళి ఎంపీగా ప్రమాణస్వీకారం చేసాక మళ్ళీ అస్సాం జైలుకు తరలించారు.
ఇప్పుడు హర్‌ప్రీత్ సింగ్ అరెస్టు అమృత్‌పాల్ సింగ్ రాజకీయ భవితవ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇప్పటికే వివాదాస్పద కార్యకలాపాలు, వేర్పాటువాద అనుకూల ప్రకటనల కారణంగా అమృత్‌పాల్ పోలీసుల పరిశీలనలో ఉన్నాడు. ఇప్పుడు హర్‌ప్రీత్‌కు డ్రగ్స్ సంబంధాల్లో ప్రమేయం ఉన్నట్లు తేలితే, అది అతని సోదరుడి రాజకీయ భవిష్యత్తును కచ్చితంగా దెబ్బతీస్తుంది.