అక్రమ మానవ రవాణాకు పాల్పడుతోన్న క్రిమినల్ అబ్దుల్ అలాంను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాల్లో ఉద్యోగాల పేరుతో యువతను కంబోడియాకు తరలించిన వ్యవహారంలో అబ్దుల్ అలాంపై అనేక కేసులు నమోదయ్యాయి. గత కొంత కాలంగా అలాం దుబాయ్లో నివాసం ఉంటున్నాడు. అతనిపై పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు.
గత రాత్రి దుబాయ్ నుంచి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన అబ్దుల్ అలాంను సైబర్ సెక్యూరిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాం చైనా సైబర్ నేరగాళ్ల సహకారంతో తెలుగు రాష్ట్రాల్లోని పదుల సంఖ్యలో యువతను కంబోడియాకు తరలించినట్లు కేసులు నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు ఇప్పటికే కొందరు ఏజంట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సూత్రధారి అలాం అరెస్టుతో మరిన్ని అరాచకాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.