జూన్ 25ను రాజ్యాంగ హత్యా దినంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. ప్రతీ యేడాదీ ఆ రోజును ఎమర్జెన్సీ ఘాతుకాలను స్మరించుకోడానికి ఆ దినాన్ని జరుపుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు.
జూన్ 25ను ‘సంవిధాన్ హత్యా దివస్’ – రాజ్యాంగ హత్యాదినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ వెలువరించింది. ఎక్స్ సామాజిక మాధ్యమంలో ఆ నోటిఫికేషన్‌ను అమిత్ షా షేర్ చేసారు.
‘‘1975 జూన్ 25న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, తన నియంత మనస్తత్వాన్ని నిస్సిగ్గుగా వెల్లడిస్తూ దేశంలో అత్యయిక పరిస్థితిని విధించారు, తద్వారా మన ప్రజాస్వామ్యపు ఆత్మను చంపేసారు. ఏ తప్పూ చేయకపోయినా లక్షలాది మందిని జైళ్ళలో నిర్బంధించారు. మీడియా గొంతు నొక్కేసారు. ఆ నేపథ్యంలో ప్రతీ యేడాదీ జూన్ 25ను సంవిధాన్ హత్యా దివస్‌గా గమనించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. 1975 ఎమర్జెన్సీలో అమానుషమైన హింసను భరించిన వారికి నివాళులర్పిస్తాం’’ అని అమిత్ షా ‘ఎక్స్’లో రాసుకొచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఎక్స్‌లో ఆ విషయాన్ని పంచుకున్నారు. ‘‘భారత రాజ్యాంగాన్ని అణగదొక్కేస్తే ఏం జరుగుతుందో గుర్తు చేసుకోడానికి ప్రతీ యేడాదీ జూన్ 25న రాజ్యాంగ హత్యా దినంగా జరుపుతాం. భారత చరిత్ర మీద కాంగ్రెస్ రుద్దిన చీకటి రోజుల నాటి ఎమర్జెన్సీ అత్యాచారాలకు బలైపోయిన ప్రతీ ఒక్క వ్యక్తికీ నివాళులర్పించే రోజది’’ అని మోదీ రాసుకొచ్చారు.
ఇటీవల లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ నాయకులు 400పైగా సీట్లు గెలుచుకుంటామని చెప్పడాన్ని కాంగ్రెస్ అవకాశంగా తీసుకుంది. అంత మెజారిటీ వస్తే బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేస్తుందంటూ ప్రచారం చేసింది. బీజేపీ నాయకులు దానికి సరిగ్గా ప్రతిఘటించలేకపోయారు. ఫలితంగా ఆ పార్టీ గెలుచుకున్న సీట్ల సంఖ్య తగ్గిపోయింది. ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా, పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ప్రదర్శిస్తూ అధికార పక్షంపై దాడి కొనసాగించింది.
దానికి ప్రతిదాడిగా బీజేపీ ఎమర్జెన్సీ అంశాన్ని ఎత్తుకుంది. రాజ్యాంగాన్ని తీవ్రంగా ఉల్లంఘించి, ప్రజలను హింసించింది కాంగ్రెస్ పార్టీయే అని ప్రచారం చేయడానికి, ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితి గురించి తరచుగా మాట్లాడడం మొదలుపెట్టింది.
ఈ యేడాది జూన్ 25న ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, ఎన్‌డీయే ప్రభుత్వ ముఖ్యులు ఎమర్జెన్సీ అరాచకాల గురించి ప్రకటించారు. ఎమర్జెన్సీ చీకటి రోజులు కాంగ్రెస్ పార్టీ మన ప్రజల కనీస స్వేచ్ఛను ఎలా హరించివేసారో, రాజ్యాంగాన్ని ఎలా అణచివేసారో గుర్తుచేస్తాయి అంటూ రాసుకొచ్చారు. దేశం మీద ఎమర్జెన్సీ విధించినవారు ఇప్పుడు భారత రాజ్యాంగం మీద ప్రేమ నటిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన వారే ఇప్పుడు రాజ్యాంగం గురించి నీతులు చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాల్లో కూడా రాష్ట్రపతి తన ప్రసంగంలో ఎమర్జెన్సీ చీకటి రోజుల గురించి ప్రస్తావించారు.
ఇప్పుడు జూన్ 25ను రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటించడం ద్వారా బీజేపీ, కాంగ్రెస్‌పై దాడిని ఉధృతం చేసింది.