కేరళ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైస్‌ఛాన్సలర్లు తమ వ్యక్తిగత లీగల్ ఖర్చులను తామే భరించాలని ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆదేశించారు. అటువంటి వ్యక్తిగత అవసరాల కోసం యూనివర్సిటీ నిధులను వాడవద్దని సూచించారు. ఛాన్సలర్ హోదాలో గవర్నర్ తీసుకునే నిర్ణయాలను సవాల్ చేసేందుకు వీసీలు విశ్వవిద్యాలయాల నిధులను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అటువంటి లీగల్ ప్రొసీడింగ్స్ కోసం వ్యయం చేసిన రూ.1.13 కోట్లను రీఇంబర్స్ చేయాలని గవర్నర్ డిమాండ్ చేసారు.
కేరళలో పలు విశ్వవిద్యాలయాలకు వామపక్ష కూటమి ప్రభుత్వం వైస్ ఛాన్సలర్లను నియమించింది. అయితే వారి అర్హతలపై వివాదాలు ఉన్న సందర్భాల్లో అటువంటి నియామకాలను రాష్ట్ర గవర్నర్ తిరస్కరించారు. అటువంటి వీసీలు కోర్టుకెక్కారు. వారిలో కన్నూర్ విశ్వవిద్యాలయం మాజీ వీసీ డా. గోపీనాథ్ రవీంద్రన్, కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ వీసీ డా. రిజీ జాన్, కాలికట్ యూనివర్సిటీ వీసీ డా. ఎంకె జయరాజ్, ఎపిజె అబ్దుల్ కలాం టెక్నలాజికల్ యూనివర్సిటీ మాజీ వీసీ డా.ఎంఎస్ రాజశ్రీ, మలయాళం యూనివర్సిటీ మాజీ వీసీ డా. వి అనిల్‌కుమార్, కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీసీ డా.కెఎన్ మధుసూదనన్, శ్రీనారాయణ ఓపెన్ యూనివర్సిటీ వీసీ డా.ముబారక్ పాషా ఉన్నారు.
ఇప్పటికే రిటైర్ అయిన గోపీనాథ్ రవీంద్రన్, ఇవాళ రిటైర్ అవుతున్న జయరాజ్ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీలో చేరడానికి సిద్ధమవుతున్నారు. వారు తమ లీగల్ ఖర్చులను ప్రస్తుత యూనివర్సిటీ ఖర్చులో చూపించారు. ఆ నేపథ్యంలో గవర్నర్ మొహమ్మద్ ఆరిఫ్ ఖాన్ ఇవాళ ఈ ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
గోపీనాథ్ రవీంద్రన్ కన్నూర్ యూనివర్సిటీ వీసీగా రిటైర్ అయ్యారు. ఆ విశ్వవిద్యాలయంలో ప్రియావర్గీస్ అనే ఉద్యోగి నియామకం గురించిన కోర్టు కేసులో రూ 8లక్షలు ఖర్చుపెట్టారు. ప్రియావర్గీస్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యక్తిగత కార్యదర్శి కెకె రాగేష్ భార్య. అలా ఒక్కో యూనివర్సిటీ తరఫున ఆయా వీసీలు పెట్టిన లీగల్ ఖర్చుల వివరాలు ఇలా ఉన్నాయి
కన్నూర్ విశ్వవిద్యాలయం : రూ. 69,25,340
కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ : రూ. 35,71,311
కాలికట్ యూనివర్సిటీ : రూ. 4,25,000
ఎపిజె అబ్దుల్ కలాం టెక్నలాజికల్ యూనివర్సిటీ : రూ. 1,47,515
మలయాళం యూనివర్సిటీ : రూ. 1,00,000
కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ : రూ. 77,500
శ్రీనారాయణ ఓపెన్ యూనివర్సిటీ : రూ. 53,000
కేరళలో గవర్నర్‌ను వామపక్షకూటమి ప్రభుత్వం మొదటినుంచీ అవమానిస్తూనే ఉంది. విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకాల విషయంలో రాజకీయాలు, అర్హతలూ వివాదాస్పదమైన సందర్భాల్లో గవర్నర్ అటువంటి నియామకాలను ఆమోదించలేదు. దాంతో వారు గవర్నర్ పైనే కేసులు వేయడం గమనార్హం. అలాంటి వీసీలు తమ వ్యక్తిగత పోరాటాలకు ప్రజల సొమ్ములు వృథా చేయడాన్ని గవర్నర్ అడ్డుకునే ప్రయత్నం చేస్తుండడం విశేషం.