ఉత్తరప్రదేశ్‌లో హథ్రస్ తొక్కిసలాట ఘటనపై విచారణ జరపాలంటూ విశాల్ తివారీ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇలాంటి ఘటనలను తరచూ గుర్తు చేస్తూ ఉంటే ప్రజలు భయాందోళనకు గురవుతారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ ధర్మాసనం అభిప్రాయపడింది. కేసును విచారించేందుకు అలాహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది.
హథ్రస్ ప్రాంతంలో భోలేబాబా జూలై 2న నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట కారణంగా 121 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన తరవాత బాధితులకు వైద్య సహాయం చేసేందుకు కూడా అక్కడ ఆసుపత్రులు లేవని విశాల్ తివారీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం దృష్టిపెట్టాలని పిటిషనర్ కోరారు. దీన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది.