తెలంగాణలోని ఒక ఆదర్శ పాఠశాలలో కొద్దిరోజుల క్రితం అల్పాహారంలో బల్లి కనిపించిన సంఘటన సంచలనం సృష్టించింది. ఆ ఘటనను కేంద్రప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది,
మూడు రోజుల క్రితం మెదక్ జిల్లా రామాయంపేటలోని ఆదర్శ పాఠశాల బాలికల హాస్టల్లో ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా ఉప్మా వడ్డించారు. అందులో బల్లి పడినట్లు గమనించిన పాఠశాల కేర్‌టేకర్, టిఫిన్ తినవద్దంటూ విద్యార్ధులను హెచ్చరించారు. అప్పటికే సుమారు 40మంది పిల్లలు ఆ టిఫిన్ తిన్నారు.
బల్లి పడిన అల్పాహారం తిన్న 17మంది విద్యార్ధినులకు వాంతులయ్యాయి. పిల్లలను వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిని వైద్యులు పరీక్షించి వెంటనే పంపించివేసారు. ఇద్దరి పరిస్థితి మాత్రం తీవ్రంగా ఉండడంతో వారిని ఆస్పత్రిలోనే అబ్జర్వేషన్లో ఉంచారు.
విషయం తెలియడంతో పాఠశాలలో పనిచేసే వంటమనిషిని, వంట సహాయకులను విధుల నుంచి తప్పించారు. బాలికల హాస్టల్ ప్రత్యేక అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేసారు.
ఈ విషయం తెలియడంతో కేంద్రప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. భారత ప్రభుత్వపు పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం ఆ పరిస్థితిని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది.
‘‘రాష్ట్రంలోని కొన్ని పాఠశాలలు కేంద్రప్రభుత్వ పథకం ‘పీఎం పోషణ్’ కింద లేవు. అలాంటి చోట్ల రాష్ట్రప్రభుత్వమే తమ నిధులతో అల్పాహారం అందజేస్తోంది. ఈ ప్రత్యేక పాఠశాల పీఎం పోషణ్ స్కీమ్ పరిధిలో లేదు. అయినప్పటికీ కేంద్రం ఆ సంఘటనపై ఆరా తీసింది. సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకున్నట్లు రాష్ట్రప్రభుత్వం వెల్లడించింది’’ అంటూ కేంద్ర విద్యాశాఖ ఒక ప్రకటన విడుల చేసింది.
‘పిఎం పోషణ్’ పథకం కింద దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మధ్యాహ్న సమయంలో వేడివేడిగా వండిన ఆహారాన్ని వడ్డిస్తారు. అలాంటి చోట్ల భద్రతా ప్రమాణాలు పాటించాలనీ, విద్యార్ధులకు చక్కగా వండిన ఆహారం వేడివేడిగా వడ్డించాలనీ కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది.