అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ శారీరక, మానసిక స్థితిగతులు అదుపు తప్పుతున్నాయి. తాజాగా, తమ దేశపు మిత్రుడిని చిరకాల శత్రువు పేరుతో పిలిచారు. తర్వాత తన పొరపాటును సమర్ధించుకునే ప్రయత్నం చేసినా అది సరిగ్గా కుదరలేదు.
81 ఏళ్ళ జో బైడెన్ గురువారం వాషింగ్టన్లో జరిగిన నాటో సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీని పొరపాటున రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేరుతో సంబోధించారు. అధ్యక్ష పదవికి మరోసారి తన అభ్యర్ధిత్వం ఖరారవడానికి కీలకమైన పాత్రికేయ సమావేశానికి కొన్ని గంటల ముందే బైడెన్ ఈ పొరపాటు చేయడం గమనార్హం.
నాటో సమావేశానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని పరిచయం చేసే క్రమంలో ఆయన పేరును ‘ప్రెసిడెంట్ పుతిన్’ అని పలికారు బైడెన్. వెంటనే తన తప్పును సరిదిద్దుకున్నారు. జెలెన్స్కీ సైతం ఓ నవ్వు నవ్వి ఊరుకున్నారు. పుతిన్ కంటె బైడెనే మెరుగ్గా ఉన్నారని కితాబిచ్చారు కూడా. అయితే, బైడెన్ మానసిక స్థితిపై ఇప్పటికే ఉన్న అనుమానాలు మరింత బలపడ్డాయి.
రెండువారాల క్రితం ప్రత్యర్ధి డొనాల్డ్ ట్రంప్‌తో చర్చాగోష్ఠిలో కూడా బైడెన్ ఘోరంగా తడబడ్డారు. అప్పుడే ఆయనపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. అయితే సుదీర్ఘ విమాన ప్రయాణంతో అలసిపోయినందున సరిగ్గా మాట్లాడలేదంటూ బైడెన్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏకంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు పుతిన్ అని సంబోధించారు.
తన తప్పు తెలుసుకున్న బైడెన్ మళ్ళీ పోడియం దగ్గరకు వచ్చి వివరణ ఇచ్చారు. పుతిన్‌ను ఓడించడం గురించే ఆలోచిస్తుండడం వల్ల పొరపాటున అతని పేరే పలికానని చెప్పారు.
అయితే జెలెన్స్కీ సహా ఇతర దేశాల నేతలు బైడెన్ పొరపాటును పెద్దగా పట్టించుకోలేదు. ఒక్కోసారి మాట జారుతూ ఉంటుంది, పెద్దగా పట్టించుకోనక్కరలేదని జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ అన్నారు. బైడెన్ దృఢంగానే ఉన్నారని, నాయకత్వానికి సమర్ధులేననీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ వ్యాఖ్యానించారు.