కలియుగ ప్రత్యక్ష దైవం వేంచేసిన తిరుమల క్షేత్రంలో ఆకతాయిల చర్యలపై పాలకమండలి స్పందించింది. భక్తుల మనోభావాలను కించపరిచేలా వ్యవహరిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించింది. వినోదం కోసం భక్తులను ఇబ్బంది పెట్టడం హేయమైనచర్య అని హితవు పలికింది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫ్రాంక్ వీడియో ఘటనను ఖండించడంతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొంది.
తిరుమల శ్రీవారి సర్వదర్శనం క్యూలైన్ లో కొందరు తమిళ యూట్యూబర్లు భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారు. నారాయణగిరి షెడ్స్ లోని క్యూ లో వెళ్తూ, మరో కంపార్టుమెంట్ తాళాలు తీసే టీటీడీ ఉద్యోగిలా ప్రవర్తించారు. కంపార్ట్మెంట్ లో నిరీక్షిస్తున్న భక్తులు ఆ తాళాలు తీసే వ్యక్తిని నిజమైన టీటీడీ ఉద్యోగిగా భావించి ఒక్కసారిగా పైకి లేవగానే సదరు యూట్యూబర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెకిలిగా నవ్వుతూ పరుగులు పెట్టే ఆ యూట్యూబర్ ను మరో వ్యక్తి వీడియో తీశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా తమిళనాట చక్కర్లు కొడుతోంది. దీనిపై టీటీడీ స్పందించడంతో పాటు హెచ్చరికలు జారీ చేసింది.
నారాయణగిరి షెడ్స్ దాటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ప్రవేశించే సమయంలోనే భక్తుల నుంచి మొబైల్స్ డిపాజిట్ చేస్తారు. కొందరు ఆకతాయీలు మాత్రం దొంగచాటుగా ఇలాంటి వెకిలి చేష్టలకు పాల్పడుతారు.