1994 నాటి ఇస్రో గూఢచర్యం కేసు కేరళలోని ఒక సీనియర్ పోలీస్ అధికారి కల్పించిన అక్రమ కేసు అని సిబిఐ తిరువనంతపురం కోర్టుకు వెల్లడించింది. కేరళకు వచ్చిన ఒక మాల్దీవుల మహిళను సొంతం చేసుకోడానికి స్పెషల్ బ్రాంచ్ అధికారి ప్రయత్నించారు. ఆమె నిరాకరించడంతో ఆమెపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆ క్రమంలో నంబి నారాయణన్‌ను కూడా ఇరికించారని సిబిఐ తెలియజేసింది.
సిబిఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లో వివరాలు ఇలా ఉన్నాయి.
కేరళ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ అధికారి ఎస్ విజయన్, మాల్దీవుల నుంచి భారత్ వచ్చిన మరియం రషీదా అనే మహిళపై కన్నువేసాడు. అతని ప్రయత్నాలను ఆమె త్రోసిపుచ్చింది. దాంతో విజయన్ ఆమెపై పగబట్టాడు. మరియం రషీదా స్వదేశానికి వెళ్ళడానికి వీలులేకుండా ఆమె ప్రయాణ పత్రాలను, విమాన టికెట్లను అక్రమంగా జప్తు చేసాడు. అనంతర కాలంలో విజయన్ ఎస్పిగా రిటైర్ అయ్యాడు.
మరియం రషీదాకు ఇస్రో శాస్త్రవేత్త డి శశికుమారన్‌తో స్నేహం ఉందని విజయన్‌కు తెలిసింది. మరియం రషీదా, ఆమె స్నేహితురాలైన మాల్దీవులకు చెందిన మరో మహిళ ఫౌజియా హసన్పైన నిఘా పెట్టమని తన సహచరులను ఉసిగొల్పాడు. దాంతో కేరళ పోలీసులు సబ్సిడరీ ఇంటలిజెన్స్ బ్యూరోను అప్రమత్తం చేసారు. ఐబీ అధికారులు ఆ ఇద్దరు విదేశీ మహిళలను పరిశీలించి వారి ప్రవర్తనలో అనుమానించదగినది ఏమీ లేదన్న నిర్ణయానికి వచ్చారు.
తర్వాత రషీదాను భారతదేశంలో నిర్ణీత గడువు కంటె ఎక్కువ కాలం ఉన్నారంటూ దొంగకేసు పెట్టి అరెస్ట్ చేసారు. అయితే అది తప్పుడు కేసు అని అప్పటి తిరువనంతపురం పోలీస్ కమిషనర్, ఎస్ఐబీ డిప్యూటీ డైరెక్టర్ ఇద్దరికీ తెలుసు.
ఆ కేసులోనూ రషీదా కస్టడీ గడువు ముగుస్తుండడంతో, విజయన్ రషీదా మీద మరో తప్పుడు నివేదిక రూపొందించాడు. ఇస్రో శాస్త్రవేత్తలను లోబరచుకుని సంస్థ రహస్యాలను దొంగిలిస్తోందంటూ తప్పుడు గూఢచర్యం కేసు పెట్టాడు. ఆ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) అప్పగించారు. సిట్ టీమ్ నలుగురు శాస్త్రవేత్తలను అరెస్ట్ చేసింది. వారిలో నంబి నారాయణన్ కూడా ఉన్నారు. నారాయణన్, ఆయన సహచర శాస్త్రవేత్తలపై మరిన్ని కొత్త ఆరోపణలు కూడా జోడించి, గూఢచర్యం కేసులో అడ్డంగా ఇరికించారు.
సిబిఐ తన తుది నివేదికలో, ఆ కుట్రలో పాలుపంచుకున్న మాజీ డీజీపీలు ఆర్బి శ్రీకుమార్, శిబి మ్యాథ్యూస్, మాజీ ఎస్పిలు ఎస్ విజయన్, కెకె జోషువా, మాజీ ఇంటలిజెన్స్ అధికారి పిఎస్ జయప్రకాష్‌లను ప్రోసిక్యూట్ చేయాలని సూచించింది. ఆ కుట్రకు సంబంధించి అప్పటి ఐబీ అధికారులు, కేరళ పోలీసు అధికారులు మరో 13 మంది నిందితులు కూడా ఉన్నా, తగిన సాక్ష్యాలు లేనందున వారిపై ప్రోసిక్యూషన్‌కు సీబీఐ సూచించలేకపోయింది.
సిబిఐ బుధవారం నాడు ఈ ఛార్జిషీట్‌ను తిరువనంతపురం కోర్టుకు వెల్లడించింది. దానిపై నంబి నారాయణన్ స్పందిస్తూ తన నిర్దోషిత్వం ఇప్పటికే నిరూపితమైందని, అందువల్ల ఆ వ్యవహారంలో తన పాత్ర ముగిసిందన్నారు. వారు జైలుకు వెళ్ళాలనో లేక తనకు క్షమాపణలు చెప్పాలనో కోరుకోవడం లేదన్నారు. అయితే నిందితులు తాము చేసింది తప్పు అని ఒప్పుకుంటే సంతోషిస్తానని నంబి నారాయణన్ అన్నారు.
నిజానికి ఈ కేసును దర్యాప్తు చేసినప్పుడు 1996లోనే సిబిఐ తన నివేదికలో నంబి నారాయణన్ తదితరులపై పెట్టిన కేసులు తప్పుడువని స్పష్టం చేసింది. ఐబీ అధికారులు బాధ్యతారహితంగా ప్రవర్తించి ఆరుగురు నిర్దోషులను అరెస్టు చేసారు, వారిని శారీరకంగా హింసించారు, మానసికంగా వేదనకు గురిచేసారు అని తేల్చిచెప్పింది. ప్రత్యేకించి శ్రీకుమార్ అనే అధికారి తప్పు చేసారని నిర్దిష్టంగా పేర్కొంది.
నంబి నారాయణన్ గూఢచర్యం కేసులో పోలీసు అధికారుల పాత్ర గురించి ఉన్నతస్థాయి విచారణ జరపాలని సుప్రీంకోర్టు 2018లో ఆదేశించింది. ఆ యేడాది సెప్టెంబర్ 14న త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. నంబి నారాయణన్ పరువుకు భంగం కలిగించి, ఆయనను తీవ్ర అవమానాలకు గురి చేసినందుకు ఆయనకు రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది.