నేపాల్లో ఘోర ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున నేపాల్ రాజధాని ఖాట్మండు వెళుతోన్న రెండు బస్సులపై నారాయణఘాట్ ముగ్లింగ్ జాతీయ రహదారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో బస్సులు త్రిశూన్ నదిలో పడిపోయాయని బయటపడ్డ ప్రయాణీకులు తెలిపారు. రెండు బస్సులు నదిలో పడిపోవడంతో 65 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఏడుగురు భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. నదిలో పడిపోయిన వాహనాలు, గణపతి డీలక్స్, ఏంజల్ బస్ సర్వీసులుగా గుర్తించారు.
ఈ ఘటనపై నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయ చర్యలకు అధికారులను ఆదేశించారు. ప్రమాదం నుంచి ముగ్గురు ప్రయాణీకులు తప్పించుకోగలిగారు. వారిచ్చిన సమాచారంతో ప్రమాదం ఘటన వెలుగులోకి వచ్చింది.