పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్న ఒడిశా ప్రభుత్వం
ఒడిశాలోని శ్రీక్షేత్ర రత్నభాండాగారం తెరిచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జస్టిస్ బిశ్వనాథ్ అధ్యక్షతన ఏర్పాటైన అధ్యయనసంఘం ఈ నెల 14న భాండాగారం తెరవడానికి నిర్ణయించింది.
ఈ విషయాన్ని న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ వెల్లడించారు. శ్రీక్షేత్ర పాలకవర్గం ఆమోదం మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు. అధ్యయన సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
రత్నభాండాగారం తెరిచేందుకు ఎంత మంది వెళతారనే విషయంపై స్పష్టత లేదన్నారు. భాండాగారం లోపల చీకటిగా ఉండటంతో అక్కడ విషసర్పాలు ఉండొచ్చు అని అనుమానిస్తున్నారు. దీంతో సెర్చ్లైట్లు, స్నేక్ హెల్ప్‌లైన్ నిపుణులు, అత్యవసర వైద్యానికి డాక్టర్లు లోపలికి వెళ్లే అవకాశముంది. భాండాగారానికి వెంటనే మరమ్మతులు చేయడానికి పురావస్తు శాఖ సిద్ధమైంది. స్వామికి చెందిన కానుకలులను శ్రీ క్షేత్రం లోపల మరోచోట భద్రపరిచి లెక్కింపు చేసే అవకాశముంది. ఆభరణాల బరువు తూకం, వాటి నాణ్యత పరిశీలించడానికి ప్రభుత్వం కొంత మంది నిపుణుల్ని నియమిస్తున్నట్లు సమాచారం.