ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ వెళ్ళబోదని తెలుస్తోంది. తాము ఆడే మ్యాచ్‌లను శ్రీలంక లేదా దుబాయ్‌లో నిర్వహించాలని ఐసీసీని కోరే అవకాశముంది.
2025లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి, మార్చి నెలల్లో పాకిస్తాన్‌లో నిర్వహిస్తారు. అయితే ఇరు దేశాల మధ్యా సంబంధాలు సరిగ్గా లేనందున 2008 ఆసియా కప్ సమయం నుంచీ భారతదేశం పాకిస్తాన్‌లో క్రికెట్ టోర్నమెంట్లు ఆడడం లేదు.
2012 డిసెంబర్ నుంచి 2013 జనవరి వరకూ భారత్‌లో జరిగిన ద్వైపాక్షిక సీరీసే రెండు దేశాల మధ్యా నేరుగా జరిగిన ఆఖరి ద్వైపాక్షిక సీరీస్. అప్పటినుంచీ భారత్, పాక్ దేశాలు కేవలం ఐసీసీ టోర్నమెంట్లు, ఆసియా కప్‌లో మాత్రమే తలపడుతున్నాయి. ఇరుదేశాల మధ్యా సంబంధాలు బాగులేనందున ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనే అవకాశాలపై అనిశ్చితి నెలకొంది.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారత బృందాన్ని అన్ని మ్యాచ్‌లూ ఒకే నగరంలో ఆడవలసిందిగా ప్రతిపాదించింది. అలా ఆడడానికి లాహోర్ నగరాన్ని సూచించినట్లు సమాచారం. అయితే ఆ ప్రతిపాదనకు భారతదేశం నిరాకరించినట్లు తెలుస్తోంది.
బీసీసీఐలోని ఒక కీలక అధికారి ‘‘భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆడడానికి పాకిస్తాన్ వెళ్ళబోదు. భారత్ ఆడే మ్యాచ్‌లను దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీకి చెబుతాం’’ అని వెల్లడించారు.
మే నెలలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం అనుమతిస్తేనే భారత బృందాన్ని పాకిస్తాన్‌కు పంపిస్తామని చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీ అయినా సరే, భారత ప్రభుత్వ నిర్ణయం మేరకే మన జట్టు ఆడుతుందని స్పష్టం చేసారు.
గతేడాది ఆసియాకప్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చినప్పుడు భారత్ ఆ దేశానికి వెళ్ళలేదు. అప్పుడు పాకిస్తాన్ కంట్రోల్ బోర్డ్ హైబ్రిడ్ విధానాన్ని అవలంబించింది. మన దేశం ఆడవలసిన మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించారు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఆఖరిసారి 2017లో నిర్వహించారు. అప్పుడు పాకిస్తాన్ విజేతగా నిలిచింది.