సరిహద్దు వెంబడి స్మగ్లింగ్ చేస్తున్న రాకెట్‌ను ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ విభాగం పట్టుకుంది. తూర్పు లద్దాఖ్‌లో భారత్-చైనా సరిహద్దుల వద్ద చొరబాట్లకు సహకరిస్తూ, స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసింది. వారి నుంచి 108 కేజీల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకుంది.
‘‘ఐటీబీపీ తూర్పు లద్దాఖ్‌లోని సదరన్ సబ్సెక్టార్లో లాంగ్రేంజ్ పెట్రోలింగ్ చేస్తోంది. చిస్ములీ, నర్బులా టాప్, జాక్లే అండ్ జాక్లా ప్రాంతాల్లో చొరబాట్లు, స్మగ్లింగ్ కార్యకలాపాలు పెరుగుతున్నాయి. అందువల్ల ఆ పరిసరాల్లో నిఘా ముమ్మరం చేసాం. ఆ క్రమంలో జులై 9 మధ్యాహ్నం సిరిగాప్లే వద్ద స్మగ్లింగ్ జరుగుతోందని సమాచారం లభించింది. మా పెట్రోలింగ్ టీమ్ అక్కడకు చేరుకుంది. జులై 9 అర్ధరాత్రి దాటాక సుమారు 2 గంటల సమయంలో అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ఇద్దరు వ్యక్తులు గాడిదల మీద ప్రయాణిస్తూ అనుమానాస్పదంగా కనిపించారు. పెట్రోలింగ్ పార్టీ వారిని అదుపులోకి తీసుకుని క్యాంపింగ్ ఏరియాకు తరలించింది. వారి దగ్గర పెద్దమొత్తంలో బంగారం, ఇతర వస్తువులు లభించాయి. వారిని కస్టడీలోకి తీసుకుని, ఆ వస్తువులను సీజ్ చేసాం’’ అని ఐటీబీపీ ఒక ప్రకటనలో తెలియజేసింది.
అరెస్ట్ అయిన టెంజిన్ టార్జీ (40), సెరింగ్ చంబా (69) అనే ఇద్దరు వ్యక్తులూ భారతీయులే. వారిని, వారి దగ్గర సీజ్ చేసిన బంగారాన్నీ కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.
108 కేజీల బంగారు కడ్డీలతో పాటు వారి దగ్గర రెండు మొబైల్ ఫోన్లు, ఒక బైనాక్యులర్స్, టార్చ్, కొండలను తవ్వే పరికరాలు, కొన్ని చైనీస్ ఆహార పదార్ధాలూ లభించాయి. కస్టమ్స్ విభాగం అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించింది.
సరిహద్దుల వెంబడి చొరబాట్లు, స్మగ్లింగ్ కార్యక్రమాలను నియంత్రించేందుకు నిఘా పెంచామని ఐటీబీపీ వెల్లడించింది.