తిరుమల తిరుపతి దేవస్థానాలకు జగన్ హయాంలో అదనపు ఈఓగా పనిచేసిన ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. టీటీడీలో ధర్మారెడ్డి పెద్దయెత్తున అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రభుత్వం స్పందించింది. ఆ క్రమంలో ఆయనకు సహకరించిన ఇతర ఉద్యోగులను కూడా విచారణ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అధికార టిడిపి కూటమి నాయకులు కొద్దిరోజుల క్రితం ధర్మారెడ్డి, టిటిడి మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డిలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసారు. వైఎస్‌ఆర్‌సిపికి లాభం కలిగించేలా వారిద్దరూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. శ్రీవాణి టికెట్ల విక్రయంలో అక్రమాలకు పాల్పడ్డారని, బడ్జెట్‌తో సంబంధం లేకుండా సివిల్ కాంట్రాక్టు పనులు జారీ చేసారని, తన పదవిని దుర్వినియోగం చేసి వైసీపీకి విరాళాలు సేకరించారనీ, తిరుమల సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించారనీ ఆరోపణలు చేసారు. వారిపై సిబిసిఐడి లేదా విజిలెన్స్ విభాగంతో విచారణ జరిపించాలని కోరారు. దానికి స్పందనగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు, జగన్ హయాంలో సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్‌గా పనిచేసిన విజయ్‌కుమార్ రెడ్డిపైన కూడా విజిలెన్స్ విచారణకు రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ప్రకటనల పేరిట సమాచార శాఖలో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు