తెలంగాణలో ప్రేమ పేరుతో ఒక ఉన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తను ప్రేమించిన యువతి కుటుంబంపై దాడి చేసాడు. ఆ దాడిలో యువతి తల్లిదండ్రులు చనిపోయారు. యువతి, ఆమె సోదరుడు గాయపడ్డారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం… బానోతు శ్రీనివాస్, సుగుణ దంపతులు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పదహారు చింతల తండాలో నివాసముంటున్నారు. వారికి ఒక కుమార్తె దీపిక, కుమారుడు మదన్‌లాల్. గత నవంబర్‌లో దీపికను గుండెంగ గ్రామానికి చెందిన మేకల నాగరాజు అనే యువకుడు ప్రేమవివాహం చేసుకున్నాడు. ఈ యేడాది జనవరిలో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు ఇరువర్గాలకూ కౌన్సిలింగ్ చేసి, దీపికను తన తల్లిదండ్రులతో వెనక్కు పంపించేసారు. దీపిక ఇంట్లోనే ఉంటూ హన్మకొండలో డిగ్రీ రెండో యేడాది చదువుతోంది.
దీపిక తల్లిదండ్రులు ఇటీవల ఆమెకు పెళ్ళి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ఆ విషయం నాగరాజుకు కొద్దిరోజుల క్రితం తెలిసింది. దాంతో గత అర్ధరాత్రి (బుధవారం) దాటాక అతను దీపిక ఇంట్లోకి చొరబడ్డాడు. తనతో తెచ్చిన తల్వార్‌తో దాడి చేసాడు. ఆ ఘటనలో తల్లి సుగుణ అక్కడికక్కడే మరణించింది.
విషయం తెలిసిన పోలీసులు దీపిక, ఆమె తండ్రి, సోదరుణ్ణి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ తండ్రి శ్రీనివాస్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీపిక, ఆమె సోదరుడు మదన్‌లాల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారికి చికిత్స జరుగుతోంది.
నిందితుడు ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. పోలీసులు అతనికోసం గాలిస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యగా తండాలో బందోబస్తు నిర్వహించారు.