భారతదేశం ఎప్పుడూ శాంతికాముక దేశమే తప్ప యుద్ధపిపాసి కాదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ప్రపంచానికి భారతదేశం బుద్ధుణ్ణి ఇచ్చింది తప్ప యుద్ధాన్ని కాదని ఆయన చెప్పారు. ఆస్ట్రియా పర్యటనలో భాగంగా ఆ దేశ రాజధాని వియన్నాలో ప్రవాస భారతీయులతో మోదీ సమావేశమయ్యారు.
ఆ సందర్భంగా చేసిన ప్రసంగంలో మోదీ, ప్రపంచదేశాలు ఇప్పుడు భారత్ వైపు ఆసక్తిగా చూస్తున్నాయన్నారు. భారతదేశపు ఆలోచనలను, ఆచరణలనూ నిశితంగా పరిశీలిస్తున్నాయని చెప్పారు. ప్రపంచంలోని ప్రాచీన నాగరికతల్లో ఒకటైన భారత్, వేలయేళ్ళుగా తమ విజ్ఞానాన్నీ, నైపుణ్యాన్నీ ప్రపంచంతో పంచుకుంటోందని గుర్తు చేసారు. శాంతిని ప్రచారం చేస్తోంది తప్ప యుద్ధాన్ని కాదని మోదీ వివరించారు. ప్రపంచం ఇప్పుడు మన దేశాన్ని ‘విశ్వబంధు’గా భావిస్తుండడం భారతీయులకు గర్వకారణమన్నారు.
వియన్నాలో 30వేలమందికి పైగా ప్రవాస భారతీయులు ప్రధాని మోదీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆస్ట్రియాతో భారత్ దౌత్యసంబంధాలు మొదలై 75ఏళ్ళు గడిచిన సందర్భంగా ఆ దేశంతో భారత్ అనుబంధాన్ని మోదీ వివరించారు. ఆస్ట్రియాలో భారత ప్రధాని పర్యటించడం 41 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి.
ఆ సమావేశంలో మోదీ తన భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించారు. 2047 నాటికి దేశం స్వాతంత్ర్యం సాధించి వందేళ్ళవుతుందని, అప్పటికి భారత్‌ను అభివృద్ధి సాధించిన దేశంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని వివరించారు. ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా భారత్ ఎదగడానికి ఇంకెంతో కాలం పట్టదని మోదీ విశ్వాసం వ్యక్తం చేసారు.
మోదీ ప్రసంగ సమయంలో భారతీయులు వందేమాతరం, భారత్‌మాతాకీ జై నినాదాలతో హోరెత్తించారు. ఆ సమావేశంతో ప్రధాని మూడు రోజుల రెండు దేశాల విదేశీ పర్యటన ముగిసింది. అనంతరం మోదీ భారత్‌కు బయల్దేరారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు