కీర్తి చక్ర పురస్కార విజేత భార్య గురించి అహ్మద్ అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో అసభ్య వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సామాన్య పౌరులు సైతం గళమెత్తుతున్నారు. ఆ నేపథ్యంలో ఆ వ్యక్తిని అరెస్టు చేయాలంటూ జాతీయ మహిళా కమిషన్ ఢిల్లీ పోలీసులను కోరింది. మూడు రోజుల్లో తమకు సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
కెప్టెన్ అన్షుమాన్ సింగ్ సియాచిన్ గ్లేషియర్ ఏరియాలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేసేవారు. 2023 జులై 19న భారత సైన్యపు ఆయుధాగారంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. కొంతమంది సైనికులు ఉన్న గుడారానికి మంటలు వ్యాపించడాన్ని అన్షుమాన్ సింగ్ గమనించారు. వారిని రక్షించడం కోసం అన్షుమాన్ ముందుకు దూకారు. ఐదుగురు జవాన్లను బైటకు సురక్షితంగా తీసుకురాగలిగారు. అయితే మంటలు పక్కనే ఉన్న మెడికల్ ఇన్వెస్టిగేషన్ రూమ్‌కు కూడా వ్యాపించాయి. ఆ రూమ్‌లోకి చొరబడిన కెప్టెన్, మంటల్లో చిక్కుకుపోయారు. అప్పటికి ఆయన పెళ్ళయి కొద్ది నెలలు మాత్రమే అయింది.
విధినిర్వహణలో అసువులుబాసిన కెప్టెన్ అన్షుమాన్ సింగ్‌కు 2023 జులై 22న బిహార్‌లోని భాగల్పూర్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఆయనకు భారత ప్రభుత్వం కీర్తిచక్ర పురస్కారం ప్రకటించింది. 2024 జులై 8న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్షుమాన్ సింగ్ తల్లి, భార్యలకు ఆ పురస్కారాన్ని అందజేసారు. ఆ దృశ్యాలు దేశ ప్రజల్లో అత్యధికులను కన్నీళ్ళు పెట్టించాయి.
అయితే ఒక వ్యక్తి అన్షుమాన్ సింగ్ భార్య స్మృతీసింగ్ పట్ల అసభ్యంగా వ్యాఖ్యలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టాడు. మరికొందరు ఆ పోస్ట్‌ను షేర్ చేసి తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. నీచమైన ఆ ప్రవర్తనను సభ్య సమాజయం యావత్తూ చీదరించుకుంది.
ఆ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించింది. ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరాకు విజ్ఞప్తి చేసింది.
‘‘అమరవీరుడి భార్యపై అసభ్యంగా పోస్ట్ పెట్టిన వ్యక్తి పేరు అహ్మద్, అతను ఢిల్లీ నివాసి. ఆ వ్యక్తి చేసిన వ్యాఖ్య భారతీయ న్యాయసంహిత సెక్షన్ 79, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 67లను ఉల్లంఘిస్తోంది. అహ్మద్ ప్రవర్తనను మహిళా కమిషన్ ఖండిస్తోంది. అతనిపై పోలీసులు తక్షణం కఠిన చర్యతీసుకోవాలి’’ అంటూ మహిళా కమిషన్ ఎక్స్‌లో ట్వీట్ చేసింది.
అహ్మద్‌ను అరెస్ట్ చేయాలని, ఆ వ్యవహారంపై మూడురోజుల్లో తమకు సమగ్ర నివేదిక సమర్పించాలనీ ఢిల్లీ పోలీసులను జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు