ప్రేమించి మోసం చేసాడన్న ఆరోపణలపై సినీనటుడు రాజ్‌తరుణ్ మీద హైదరాబాద్ నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసారు. లావణ్య అనే యువతి ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ 420, 506, 493 సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేసినట్లు వెల్లడించారు.
లావణ్య తన ఫిర్యాదులో రాజ్‌తరుణ్ తనతో 2012 నుంచి కలిసున్నాడని, పదేళ్ళ క్రితం పెళ్ళి కూడా చేసుకున్నాడనీ లావణ్య చెప్పింది. ఇటీవల మరో నటితో సన్నిహితంగా వ్యవహరిస్తున్నట్లు తనకు తెలిసిందని ఆమె పేర్కొంది. ఆ విషయం గురించి అడిగితే తనను దూషించాడని, బెదిరించాడనీ ఆరోపించింది. తనకు సంబంధం లేని డ్రగ్స్ కేసులో తనను ఇరికించారనీ, దానివల్ల 43 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందనీ చెప్పింది.
తామిద్దరమూ విదేశాలకు కూడా వెళ్ళామంటూ కొన్ని ఆధారాలను పోలీసులకు అందజేసింది. కొన్నేళ్ళ క్రితం తనకు గర్భవిచ్ఛిత్తి చేయించాడని కూడా ఆమె ఆరోపించింది. రాజ్‌తరుణ్ ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్న తన ‘తిరగబడర సామీ’ సినిమాలో కథానాయిక అయిన మాల్వీ మల్హోత్రాతో సన్నిహితంగా ఉంటూ తనను మోసం చేస్తున్నాడని ఆరోపించింది.
రాజ్‌తరుణ్ తనకు అబార్షన్ చేయించిన డాక్యుమెంటరీ ఆధారాలు, అన్విక పేరుతో తనను విదేశాలకు తీసుకువెళ్ళిన ఆధారాలు, రాజ్‌తరుణ్ ముంబైలో ఎక్కడ ఎంతకాలం ఉన్నాడన్న ఆధారాలూ పోలీసులకు అందజేసినట్లు లావణ్య చెప్పింది.
కొద్దిరోజులుగా తెలుగు సినీ సర్కిల్స్‌లో సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో నార్సింగి పోలీసులు ఇవాళ కేసు నమోదు చేసారు.