తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్‌ను నియమించారు. ఆ మేరకు రాష్ట్రప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకూ డీజీపీగా ఉన్న రవి గుప్తాను రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. కొత్త డీజీపీ జితేందర్, సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు.
జితేందర్ స్వస్థలం పంజాబ్‌లోని జలంధర్. ఆయన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు ఎంపికయ్యారు. మొదట నిర్మల్ ఎఎస్‌పిగానూ, తర్వాత బెల్లంపల్లి అడిషనల్ ఎస్‌పిగానూ పనిచేసారు. తర్వాత మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాలకు ఎస్‌పిగా పనిచేసారు. ఆ తర్వాత ఢిల్లీలో సిబిఐలోను, కొంతకాలం గ్రేహౌండ్స్‌లోనూ పనిచేసారు. అనంతర కాలంలో విశాఖపట్నం రేంజ్ డిఐజిగా పదోన్నతి పొందారు. ఏపీ పోలీస్ అకాడెమీలో కొన్నాళ్ళు, తెలంగాణ ఉద్యమం ప్రారంభమయ్యాక వరంగల్ రేంజ్ డిఐజిగా మరికొన్నాళ్ళూ పనిచేసారు. ఏపీ సీఐడీ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తదితర విభాగాల్లో పనిచేసారు.
జితేందర్ ప్రస్తుతం తెలంగాణ హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పోలీస్ బాస్‌గా నియమితులయ్యారు. జితేందర్ 2025 సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేస్తారు.