మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూకుంభకోణం కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్యపైనే ఫిర్యాదు నమోదయింది.
నకిలీ పత్రాలతో ముడాను మోసం చేసి కోట్లాది రూపాయల విలువైన భూములను పొందారన్న ఆరోపణలపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఆయన భార్య పార్వతి, ఆయన బావమరిది మల్లికార్జున స్వామి, భూమి యజమాని దేవరాజు, ఆయన కుటుంబం మీద విజయనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదయింది.
సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ తన ఫిర్యాదులో ఇంకా ఆ కుంభకోణంలో డిప్యూటీ కమిషనర్, తహసీల్దార్, డిప్యూటీ రిజిస్ట్రార్, ముడా అధికారులపైన కూడా ఫిర్యాదు చేసారు. పోలీసులకు ఫిర్యాదు చేయడం మాత్రమే కాదు, ఆ వ్యవహారం చట్టబద్ధతపై పలు అనుమానాలు, ప్రశ్నలు సంధిస్తూ గవర్నర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శులకు కూడా లేఖలు రాసారు.
స్నేహమయి కృష్ణ ఈ వ్యవహారం గురించి మీడియాతో మాట్లాడుతూ భూమి అసలు యజమాని కొడుకును అని చెప్పుకుంటున్న దేవరాజ్ చట్టబద్ధతపైన అనుమానాలు వ్యక్తం చేసారు.
కృష్ణ ఆరోపణల ప్రకారం… వివాదంలో ఉన్న భూమి నిజానికి ముడాకు చెందినది. దాన్ని వ్యవసాయ భూమిగా డీనోటిఫై చేసారు. దానికోసం నకిలీ పత్రాలను సృష్టించారు. సిద్దరామయ్య పలుకుబడితో ఆయన బావమరిది మల్లికార్జున భూమి కొనుగోలు చేసినట్లు నకిలీ పత్రాలు రిజిస్టర్ చేయించారు. తర్వాత ఆ భూమిని తన సోదరి, ముఖ్యమంత్రి భార్య అయిన పార్వతికి దానం చేసినట్లు పత్రాలు 2010లో రిజిస్టర్ చేయించారు.
ఈ వ్యవహారంలో విజయనగర పోలీసులు ఫిర్యాదును స్వీకరించారు. కానీ దానిపై విచారణను, ఇప్పటికే ముడా భూముల అక్రమ కేటాయింపుల వ్యవహారాన్ని విచారిస్తున్న ప్రభుత్వ దర్యాప్తు బృందానికి రిఫర్ చేసారు. ఇదే విషయం మీద ప్రభుత్వ బృందం విచారణ జరుగుతోంది కాబట్టి తాము విచారించలేమని, అందువల్ల ఆ బృందానికే ఈ ఫిర్యాదును కూడా రిఫర్ చేసామనీ విజయనగర పోలీస్ స్టేషన్ ఇనస్పెక్టర్ సురేష్ కుమార్ వెల్లడించారు.
ఈ కేసు విషయమై ప్రత్యర్ధి బీజేపీ మాత్రమే కాదు, కాంగ్రెస్ ఎంఎల్‌సి హెచ్ విశ్వనాథ్ సైతం ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై తీవ్ర ఆరోపణలు చేసారు. ప్లాట్ల కేటాయింపు ప్రక్రియలో వివక్ష చోటు చేసుకుందని, దానిపై విచారణ సైతం సరిగ్గా సాగడం లేదనీ విశ్వనాథ్ మండిపడ్డారు. ప్లాట్ల కోసం తమ కుటుంబం, సిద్దరామయ్య కుటుంబం ఒకేసారి దరఖాస్తు చేసుకున్నామనీ, తమకు ప్లాట్ కేటాయించలేదనీ, సిద్దరామయ్య కుటుంబానికి మాత్రం కేటాయించారనీ వివరించారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర ఆరోపణల ప్రకారం ముఖ్యమంత్రి భార్య పార్వతికి 2ప్లాట్లకే అర్హత ఉన్నప్పటికీ 14 విలువైన ప్లాట్లు కేటాయించారు. ఈ వ్యవహారంలోనే ఈ యేడాది ఏప్రిల్ 15న ఒకే వ్యక్తికి 42 ప్లాట్లు కేటాయించారట. దాన్నిబట్టే ముడా భూ కుంభకోణం స్థాయి అర్ధం చేసుకోవచ్చు. స్వయంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి జోక్యం చేసుకోవడం వల్లనే ఈ కుంభకోణం జరిగిందని విజయేంద్ర ఆరోపించారు. ఈ వ్యవహారంలో సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు.