ఆమ్ ఆద్మీ పార్టీ మాజీమంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ ఇవాళ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరారు. దళితుల సంక్షేమం కోసం కృషి చేయాలన్న తన విజ్ఞప్తులను తిరస్కరించారంటూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసారు.
బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా, జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్‌లు రాజ్‌కుమార్ ఆనంద్‌ను పార్టీలోకి స్వాగతించారు. ‘‘నాకు ఈ అవకాశం కల్పించిన బీజేపీకి ధన్యవాదాలు. ప్రజలందరి సంక్షేమం కోసం, ప్రత్యేకించి దళితుల సంక్షేమం కోసం ఒక దళితుడిగా కష్టపడి పనిచేస్తాను’’ అని ఆనంద్ చెప్పారు.
‘‘దళితుల సంక్షేమం కోసం పని చేయాలని అరవింద్ కేజ్రీవాల్‌ను నేను పదేపదే కోరాను. కానీ నా విజ్ఞప్తులను ఆయన ఎప్పటికప్పుడు నిరాకరిస్తూ వచ్చారు. అందుకే నేను మంత్రి పదవికి సైతం రాజీనామా చేసాను. ఎస్సీ ఎస్టీ ఫండ్ ద్వారా దళితుల సంక్షేమానికి కోట్లాది రూపాయల నిధులు కేటాయించారు, కానీ గత తొమ్మిదేళ్ళలో ఢిల్లీలో దళితుల సంక్షేమం కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఆ నిధులు ఎక్కడికి పోయాయని దళితులు ప్రశ్నిస్తున్నారు’’ అని రాజ్‌కుమార్ ఆనంద్ అడిగారు.
ఆమ్ ఆద్మీ పార్టీలో అవినీతి పెచ్చుమీరిపోతోందంటూ రాజ్‌కుమార్ ఆనంద్ ఈ ఏడాది ఏప్రిల్‌లో పార్టీకి, కేజ్రీవాల్ మంత్రివర్గానికీ రాజీనామా చేసారు. లోక్‌సభ ఎన్నికల ముందు బహుజన సమాజ్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఆయన తన భార్య వీణా ఆనంద్, మరికొందరు నాయకులతో కలిసి బీజేపీలో చేరారు.
గతేడాది నవంబర్‌లో ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రాజ్‌కుమార్ ఆనంద్ నివాసం, కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. ఆప్ ప్రభుత్వంలో భాగంగా ఉన్నప్పుడు ఆ కుంభకోణంలో సంబంధాలు ఉన్నట్లు ఆనంద్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.