మణిపూర్‌ను రెండుగా చీల్చడానికి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ప్రమాదకరమైన కుట్ర పన్నుతున్నారని ఆ రాష్ట్ర మంత్రి ఎల్ సుసీండ్రో ఆరోపించారు. రాష్ట్రంలోని రెండు ప్రధాన తెగలైన కుకీలు, మెయితీల మధ్య విభేదాలను మరింత పెంచడమే వారి లక్ష్యమని మండిపడ్డారు. మణిపూర్‌ను నిలువునా చీల్చేయాలని కాంగ్రెస్ ఎప్పటినుంచో కుట్రలు పన్నుతోందంటూ సంచలన ఆరోపణలు చేసారు. రాహుల్ గాంధీ తాజా మణిపూర్ పరన్యటన శాంతిని పెంచడం కోసం కాదనీ, హింసను ప్రజ్వరిల్లజేయడం కోసమనీ వ్యాఖ్యానించారు.
మణిపూర్‌లో స్థానిక తెగ అయిన మెయితీలకు, కుకీలకు రాహుల్ గాంధీ వేర్వేరు సందేశాలిస్తున్నారని, తద్వారా రెండు తెగల మధ్యా మరిన్ని ఘర్షణలను రెచ్చగొడుతున్నారనీ సుసీండ్రో ఆరోపించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో, మణిపూర్‌లోని రెండు ఎంపీ సీట్లు గెలుచుకోడానికి కాంగ్రెస్ మోసపూరిత వ్యూహాలు పన్నిందన్నారు. మయన్మార్ నుంచి వచ్చిన కుకీ తెగవారికి ప్రత్యేక పాలన అందిస్తామనీ, రాజకీయ-పాలనాపరమైన సెటిల్మెంట్ల కోసం ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేస్తామనీ కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసిందని వెల్లడించారు.
కాంగ్రెస్ రహస్య ఎజెండాతో మణిపూర్ ప్రజలను తప్పుదోవ పట్టించి, తమకు ఓట్లు వేసేలా చేసుకుందని సుసీండ్రో ఆరోపించారు. కుకీలకు ప్రత్యేక పాలన కోసం కాంగ్రెస్ చేసిన వాగ్దానాన్ని అమలు చేయాలంటూ ఇటీవలే ఇండైజెనస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్ రాహుల్ గాంధీకి మెమొరాండం సమర్పించిన విషయాన్ని గుర్తు చేసారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి తమ బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సుసీండ్రో చెప్పారు. ‘‘మేం ఇన్నర్ లైన్ పర్మిట్ అమలు చేస్తున్నాం. ఎన్ఆర్‌సీని అప్‌గ్రేడ్ చేస్తున్నాం, మయన్మార్-భారత్ సరిహద్దుల వెంబడి స్వేచ్ఛగా మసిలే విధానాన్ని (ఫ్రీ మూవ్‌మెంట్ రెజైమ్)ను ఇప్పటికే తొలగించాం. తద్వారా స్థానిక ప్రజలకు శాశ్వతంగా భద్రత కల్పించే ప్రయత్నాలు చేస్తున్నాం’ అని వివరించారు.
రాష్ట్రంలో హింసను రేకెత్తించి విభజన రాజకీయాలు చేయడానికి కాంగ్రెస్ కొన్ని దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నాలకు ప్రజలు లొంగిపోవద్దని మంత్రి సుసీండ్రో విజ్ఞప్తి చేసారు.