ఈశాన్య రాష్ట్రం మేఘాలయలోని ఖాసీ స్టూడెంట్స్ యూనియన్, తమ రాష్ట్రంలోని గిరిజనేతరులు అక్రమంగా ప్రవేశిస్తున్నారని ఆరోపిస్తూ, అటువంటివారి ప్రవేశాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలను తీవ్రతరం చేసింది. ఇతరులు రాష్ట్రంలోకి రావడానికి ఇన్నర్ లైన్ పర్మిట్ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తోంది. ఫలితంగా గిరిజనేతర ఉద్యోగులు, గిరిజనేతరుల సంస్థల తనిఖీ మొదలైంది. ఇది వివాదాస్పదమవడంతో పాటు రాష్ట్రంలో అశాంతికి కారణమవుతోంది.
ఖాసీ స్టూడెంట్స్ యూనియన్ మావ్లాయ్, మావ్పెరెమ్ శాఖలు జులై 8న తమతమ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి. సరైన లేబర్ లైసెన్సులు, ఎన్నికల గుర్తింపు పత్రాలూ లేకుండా వివిధ దుకాణాలు, వ్యాపార సంస్థల్లో పని చేస్తున్న 117మంది గిరిజనేతరులను గుర్తించినట్లు ప్రకటించాయి. వారు ప్రధానంగా నేపాల్‌తో పాటు బిహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి మేఘాలయలోకి వెళ్తున్నారు.
మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం వర్క్ పర్మిట్ విధానం, మేఘాల పౌరుల భద్రత చట్టం, ఇన్నర్ లైన్ పర్మిట్ వంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం చేస్తోందని కెఎస్‌యు నాయకులు ఆరోపిస్తున్నారు. అందువల్లే తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేసామంటున్నారు. అటువంటి చర్యలు తీసుకోవడం స్థానిక దేశీ తెగల ప్రయోజనాలను రక్షించడానికి అవసరమని ఆ సంస్థ వాదిస్తోంది. ఈ ప్రచారం షిల్లాంగ్‌లో మాత్రమే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బలం పుంజుకుంటోంది. పోలో, దంసిన్యాంగ్ తదితర ప్రాంతాల్లో లైసెన్సులు లేని పలు దుకాణాలను మూయించేసారు.
అక్రమ ప్రవేశాలకు వ్యతిరేకంగా రాష్ట్రప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోకపోవడం కెఎస్యును ఆగ్రహానికి గురిచేసింది. జులై 6న గువాహటి-షిల్లాంగ్ మార్గంలో కెఎస్‌యు అనధికారికంగా ఇన్నర్ లైన్ పర్మిట్ గేటు ఏర్పాటు చేసింది. జాతీయ రహదారి వెంబడి వాహనాలను నిలువరించి డాక్యుమెంట్లు తనిఖీ చేసింది. దాంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. కొన్నిచోట్ల కేఎస్‌యూ సభ్యులు కొంతమందిపై దాడులు కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి.
ఇటువంటి సంఘటనలు తరచుగా వెలుగుచూస్తున్నా, పోలీసులు వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నారు. ఖాసీ స్టూడెంట్స్ యూనియన్ కార్యకర్తలు మాత్రం గిరిజనేతరుల పేరుతో రాష్ట్రంలోకి ఎవ్వరినీ రానీయకూడదన్నట్లుగా మంకుపట్టు పడుతున్నారు. స్థానికుల ప్రయోజనాలను రక్షించడం, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని కాపాడడం అనే రెండు అంశాల మధ్య సమతూకం పాటించడం ప్రభుత్వానికి సవాల్‌గానే ఉంది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు