రెండు రోజుల రష్యా పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆస్ట్రియా చేరుకున్నారు. భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించడం 41 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి. 1983లో ఇందిరాగాంధీ తర్వాత మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోదీ ఆ దేశంలో పర్యటిస్తున్నారు.
భారత, ఆస్ట్రియా దేశాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొని ఇప్పటికి 75ఏళ్ళు గడిచాయి. ఆ సందర్భంగా ఇరు దేశాల మధ్యా అన్ని కీలక రంగాల్లో మరింత సన్నిహిత సంబంధాల కోసం కృషి చేయడమే ప్రధాన లక్ష్యంగా నరేంద్ర మోదీ పర్యటన కొనసాగనుంది.
ఆస్ట్రియా రాజధాని వియన్నా చేరుకున్న మోదీకి, అక్కడ రిట్జ్ కార్ల్‌టన్ హోటల్‌లో బస ఏర్పాటు చేసారు. అక్కడికి చేరుకున్న మోదీకి ప్రవాస భారతీయులు ఆహ్వానం పలికారు. ఆస్ట్రియన్ సంగీత కళాకారులు ‘వందేమాతరం’ గీతంతో మోదీకి స్వాగతం పలకడం విశేషం. ఆ వీడియోను మోదీ తన ‘ఎక్స్’ సామాజిక మాధ్యమం ద్వారా పంచుకున్నారు.
అంతకుముందు మోదీ రష్యాలో రెండురోజుల పర్యటన ముగించుకున్నారు. ఆ సందర్భంగా ఆయనకు రష్యా ప్రభుత్వం తమ దేశపు అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ది సెయింట్ ఆండ్రూ ది అపోస్తల్’ పురస్కారం బహూకరించింది. దాన్ని మోదీ భారత ప్రజలకు అంకితం చేసారు. ఆ సందర్భంగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి స్వస్తి పలకాలని మోదీ పిలుపునిచ్చారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు