ఏడు రాష్ట్రాల్లో 13 శాసనసభా నియోజకవర్గాలకు ఇవాళ ఉపయెన్నికలు జరుగుతున్నాయి. సుదీర్ఘమైన లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత దేశంలో జరుగుతున్న ఎన్నికలు ఇవే. పోలింగ్ ఈ ఉదయం 7 గంటలకు మొదలైంది. ఈ సాయంత్రం 6 గంటల వరకూ జరుగుతుంది.
బెంగాల్లో రాయ్‌గంజ్, రానాఘాట్ దక్షిణ్, బాగ్దా, మనిక్తలా నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో డెహ్రా, హమీర్పూర్, నాలాగఢ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో బదరీనాథ్, మాంగ్లౌర్ నియోజకవర్గాల ప్రజలు తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. పంజాబ్‌లోని జలంధర్ పశ్చిమం, బిహార్‌లోని రూపౌలీ, మధ్యప్రదేశ్‌లోని అమర్వాడా, తమిళనాడులోని విక్కరవాండి నియోజకవర్గాల్లో పోలింగ్ సాగుతోంది.
ఎన్నికలు జరుగుతున్న ఏడు రాష్ట్రాల్లో నాలుగింట్లో ఇండీ కూటమి పార్టీలు అధికారంలో ఉన్నాయి. మిగతా మూడు రాష్ట్రాల్లో ఎన్‌డిఎ కూటమి పార్టీలు గద్దె మీదున్నాయి. ఈ ఉపయెన్నికల్లో పలువురు సీనియర్ నాయకుల భవితవ్యం తేలనుంది.
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖూ భార్య కమలేష్ ఠాకూర్ డెహ్రా నియోజకవర్గం నుంచి పోలీ చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో కొన్నాళ్ళక్రితం ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ నియోజకవర్గాల్లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి.
బెంగాల్లో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మనిక్తలా సీటును తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకింది. రాయ్‌గంజ్, రానాఘాట్ దక్షిణ్, బాగ్దా స్థానాలను బిజెపి గెలుచుకుంది. కొన్నాళ్ళ క్రితం బిజెపి ఎమ్మెల్యేలు అధికార తృణమూల్ కాంగ్రెస్‌లోకి చేరిపోయారు. మనిక్తలాలో సిట్టింగ్ టిఎంసి ఎమ్మెల్యే సధన్ పాండే 2022 ఫిబ్రవరిలో చనిపోయారు.
ఉత్తరాఖండ్‌లోని మంగ్లౌర్ నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ జరుగుతోంది. ఆ నియోజకవర్గంలో గెలిచిన బిఎస్పి ఎమ్మెల్యే సార్వత్ కరీం అన్సారీ 2023 అక్టోబర్‌లో చనిపోయారు. దాంతో అక్కడ ఎన్నిక అనివార్యమైంది.
పంజాబ్‌లోని జలంధర్ పశ్చిమ నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నిక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్‌మాన్‌కు పరీక్షే. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని మొత్తం 13 ఎంపీ సీట్లలో ఆప్ కేవలం 3 స్థానాలను గెలుచుకోగలిగింది. దాంతో ఈ స్థానాన్ని ఎలాగైనా గెలవాలని ఆప్ ప్రయత్నిస్తోంది.