ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో ఘోరమైన రహదారి ప్రమాదం చోటు చేసుకుంది. లఖ్నవూ-ఆగ్రా ఎక్స్ప్రెస్వే మీద గాధా గ్రామ సమీపంలో ఈ ఉదయం 5.15 గంటలకు ఒక పాల ట్యాంకర్ను డబుల్ డెకర్ బస్ గుద్దేసింది. ఆ ప్రమాదంలో 18మంది ప్రాణాలు కోల్పోయారు. 30మందికి పైగా గాయపడ్డారు.
ఉన్నావ్ జిల్లా కలెక్టర్ గౌరాంగ్ రథి ప్రమాద వివరాలు వెల్లడించారు. ‘‘ఒక ప్రైవేటు బస్సు బిహార్లోని మోతిహారీ నుంచి ఢిల్లీ వెడుతోంది. ఈ ఉదయం 5 గంటల సమయానికి ఉన్నావ్ వద్ద ప్రయాణిస్తోంది. ఆ బస్సు వేగంగా ప్రయాణిస్తూ పాల ట్యాంకర్ను ఢీకొందని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. దానివల్ల 18మంది ప్రయాణికులు చనిపోయారు. గాయపడిన వారిని ఉన్నావ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాము. వారికి చికిత్స అందుతోంది. పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులను సైతం అప్రమత్తం చేసి ఉంచాం’’ అని చెప్పారు.
ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. బాధితుల్లో అత్యధికులు బిహార్ రాష్ట్రానికి చెందినవారేనని చెప్పారు. బిహార్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని, వారితో కలిసి పనిచేస్తున్నామనీ వివరించారు. ప్రమాదానికి కారణాలు పూర్తిస్థాయి విచారణ తర్వాత తెలుస్తాయని చెప్పారు. గాయపడినవారికి చికిత్స అందించడానికే మొదటి ప్రాధాన్యత అని చెప్పారు.