సీనియర్ ఐఎఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ స్వచ్ఛంద పదవీ విరమణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఆ మేరకు ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ నోటిఫికేషన్ జారీ చేసారు. మూడు నెలల తర్వాత, అంటే సెప్టెంబర్ 30 నుంచి ప్రవీణ్ ప్రకాష్ విఆర్ఎస్ అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.
ప్రవీణ్ ప్రకాష్ మొదటినుంచీ వైఎస్ఆర్సిపితో సన్నిహిత సంబంధాలు కలిగిన అధికారి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఢిల్లీ నుంచి రాష్ట్ర సర్వీసుకు వచ్చారు. జగన్ హయాంలో ప్రభుత్వంలో తానే సర్వమూ అయి ప్రవర్తించారన్న విమర్శలున్నాయి. తనకంటె సీనియర్ అధికారులను సైతం పక్కన పెట్టడంలో కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలున్నాయి. ఇంక పనితీరు పరంగా జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా నియమ నిబంధనలను సైతం పక్కన పెట్టి పనిచేసారని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. ఇంక విధినిర్వహణలో సైతం ప్రవీణ్ ప్రకాష్ వ్యవహార శైలిపై ఎన్నో విమర్శలుండేవి.
రాష్ట్రంలో టిడిపి-జెఎస్పి-బిజెపి కూటమి ప్రభుత్వం రావడంతో ప్రవీణ్ ప్రకాష్‌కు ప్రాధాన్యత తగ్గిపోయింది. కొత్త ప్రభుత్వం ఆయనను జూన్ 19న బదిలీ చేసి, ఎలాంటి పోస్టింగూ ఇవ్వకుండా పక్కన పెట్టింది. ఆ నేపథ్యంలో ఇంకా ఏడేళ్ళ సర్వీసు ఉన్నప్పటికీ ప్రవీణ్ ప్రకాష్ విఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. దాన్ని రాష్ట్రప్రభుత్వం ఇప్పుడు ఆమోదించింది.