ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్రంలో విద్యుత్ రంగం ప్రస్తుత పరిస్థితిని వివరించిన సీఎం చంద్రబాబు, ‘‘ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి’’ అని పిలుపునిచ్చారు.
ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయన్న చంద్రబాబు, శ్వేతపత్రాల ద్వారా ఆయా శాఖల గురించి ప్రజలందరికీ వాస్తవాలు చెప్పాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు.
విద్యుత్ తో ప్రతీ ఒక్కరి జీవితం ముడిపడి ఉందన్న చంద్రబాబు, విద్యుత్ రంగంపైనే ప్రజల జీవన ప్రమాణాలు ఆధారపడి ఉన్నాయన్నారు. 2014లో తాము అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉందని గుర్తు చేశారు. వైసీపీ పాలనలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారన్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు ప్రజలపై విపరీతమైన భారం మోపిందని విమర్శించారు.
వినియోగదారులపై రూ.32,166 కోట్ల భారం మోపారని వివరించారు. ఏపీ విద్యుత్ సంస్థల రుణాలు రూ.49,596 కోట్లకు పెరిగాయన్నారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలన కారణంగా రాష్ట్ర విద్యుత్ రంగానికి రూ.47,741 కోట్ల మేర నష్టాలు వాటిల్లిందని లెక్కలతో వివరించారు.
వైసీపీ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచడం వల్ల 1.53 కోట్ల మంది ప్రజలు ఇబ్బందిపడ్డారన్నారు. రాష్ట్ర విద్యుత్ రంగంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారవేత్తలు ముందుకొచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు.
అప్పులు కట్టడంతో పాటు దెబ్బతిన్న వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ప్రస్తుతం ఉందన్నారు. ఎన్నికల వాగ్దానం మేరకు ప్రజలపై భారం పడకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. భవిష్యత్ లో విద్యుత్ ఆధారిత వాహనాలు పెరుగుతాయని అంచనా వేసిన చంద్రబాబు, ఆ మేరకు విద్యుత్ ఉత్పాదన కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.