రష్యాతో భారత్ మైత్రి కొత్త పుంతలు తొక్కుతోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రష్యాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, భారత సంతతి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తాను ఒక్కడినే రష్యాకు రాలేదన్న ప్రధాని మోదీ,140 కోట్ల మంది భారతీయుల ప్రేమను తీసుకొచ్చానన్నారు. భారతదేశ మట్టి వాసనను మోసుకొచ్చాను అని తెలిపారు.
ఇటీవలే మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేసిన విషయాన్ని గుర్తు చేసిన మోదీ, మూడు రెట్ల వేగంతో పని చేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం మాస్కో చేరుకున్న ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేక ఆతిథ్యమిచ్చారు. ఇద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మోదీ-పుతిన్ ఆలింగనంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. పుతిన్‌తో మోదీ భేటీ తమను తీవ్రంగా నిరాశపర్చిందన్నారు. ఉక్రెయిన్‌పై సోమవారం రష్యా జరిపిన క్షిపణి దాడిలో 37 మంది చనిపోయారన్నారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులున్నారని తెలిపారు. 13 మంది పిల్లలు సహా 170 మంది గాయపడినట్లు వెల్లడించారు. క్షిపణి దాడి రోజే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి చెందిన నాయకుడు ప్రపంచంలోనే అత్యంత కిరాతక నేరస్థుడిని మాస్కోలో ఆలింగనం చేసుకున్నారని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
రష్యా అధ్యక్షుడితో భేటీ సందర్భంగా ఉక్రెయిన్ యుద్ధం అంశాన్ని మోదీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని భారత్ గౌరవిస్తుందన్నారు. యుద్ధభూమిలో దేనికీ పరిష్కారాలు లభించవని అభిప్రాయపడ్డారు. చర్చలు, దౌత్యమే ముందుకెళ్లే మార్గాలని భారత ప్రధాని పుతిన్‌కు సూచించినట్లు వార్తలొస్తున్నాయి.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు