కథువా ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామని రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరామనె తేల్చి చెప్పారు. ఉగ్రవాదులకు బదులిచ్చే విషయంలో వెనుకాడే పరిస్థితి ఉండదన్నారు. జవాన్ల ప్రాణత్యాగాన్ని దేశం గుర్తుంచుకుంటుందన్న గిరిధర్… అమర సైనికులకు సంతాపం తెలిపారు.
కథువాలో ఆర్మీ కాన్వాయ్ పై ఉగ్రవాదులు దాడికి తెగబడటంతో ఐదుగురు వీరజవాన్లు అమరులయ్యారు. తొలుత కాన్వాయ్ పైకి గ్రనేడ్ విసిరిన ముష్కరులు, వాహనాలలో నుంచి కిందికి దిగిన సైనికులపై కాల్పులకు తెగబడ్డారు. ఓ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీవో) సహా ఐదుగురు సైనికులు వీరమరణం చెందారు.
దాడికి పాల్పడింది తామేనని పాక్ ప్రేరేపిత కశ్మీర్ టైగర్స్ అనే మిలిటెంట్ గ్రూప్ వెల్లడించింది. గడిచిన రెండు రోజుల్లోనే సైన్యంపై ఉగ్రవాదులు రెండుసార్లు దాడికి పాల్పడ్డారు. కుల్గాంలో శనివారం జరిగిన రెండు ఎన్ కౌంటర్లలో ఇద్దరు జవాన్లను చనిపోయారు. ఎదురుకాల్పుల్లో మొత్తం ఆరుగురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది.